
రాష్ట్రంలో నరకాసుర పాలన
సత్తెనపల్లి: రాష్ట్రంలో నరకాసుర పాలన సాగుతోందని, ఏ రకంగా జరుగుతుందనటానికి తనపై కేసు పెట్టడమే ఒక ఉదాహరణ అని, వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నమోదైన అక్రమ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన సోమవారం సత్తెనపల్లి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సత్తెనపల్లి పోలీసులపై పాలకుల ఒత్తిడి ఉందని, వైఎస్సార్ సీపీ వారిపై తప్పుడు కేసులు పెడితేనే మీరు ఉద్యోగంలో ఉంటారంటూ బెదిరిస్తే, ఎస్పీ, డీఎస్పీ, సీఐలు ఏం చేస్తారంటూ అన్నారు. 11 సెక్షన్‌లతో తనపై సత్తెనపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. వాస్తవానికి ఆ రోజు తాను తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ కారులో వచ్చానన్నారు. సత్తెనపల్లి వచ్చే వరకు కూడా ఇక్కడ ఎవరు తెలియదన్నారు. అలాంటిది నేను జనాన్ని పోగు చేశానంట, నేరం చేశానంట, పోలీసుల ఆంక్షలు అతిక్రమించానంటూ నా మీద నేరం మోపి నన్ను నిందితుడిగా చేర్చారన్నారు. సత్తెనపల్లి కాదు జగన్‌తో రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా.. కేసు పెట్టి నంత మాత్రాన జగన్ జెండా వంచుతానా, జగన్ పేరు మరిచిపోతానా, జగన్‌తో తిరగడం మానేస్తానా, మీరు ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా వదలనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్ని నాని అన్నారు. ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, పార్టీ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, గుజ్జర్లపూడి సతీష్, వల్లెం నరసింహారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఎన్ని కేసులు పెట్టినా వైఎస్సార్ సీపీ జెండా వదిలేది లేదు సత్తెనపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని