
మీటర్ల ఏర్పాటుపై కూటమి నాయకులను నిలదీయండి
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారాన్ని నిలిపివేయాలని, ఈ విషయంపై ప్రజలంతా ప్రజాప్రతినిధులను నిలదీయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నిరసన తెలిపారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారానికి రాకముందు గత ప్రభుత్వం అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని పిలుపు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే అదానితో అనేక ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజల నెత్తిన విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారాన్ని మోపుతూ బలవంతంగా ప్రజలకు అంటగడుతున్నారని, దీనివలన ఇప్పటికే ప్రజలకు అర్థం కాకుండా విద్యుత్ చార్జీలు పెంచి నడ్డి విరిచారని అన్నారు. ఇప్పుడు స్మార్ట్‌మీటర్లు బిగింపు వలన ప్రజలంతా మరింతగా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఈ మేరకు పోస్టర్లు ప్రదర్శించారు. పీడీఎం రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, బీసీ సంఘం నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పిలుపు ఇచ్చిన ప్రజాసంఘాల నాయకులు మీటర్ల ఏర్పాటుపై ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో నిరసన