
పట్టణంలో వైద్యురాలి ఇంట భారీ చోరీ
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని వైద్యురాలి ఇంటిలో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీ చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...స్థానిక పురుషోత్తమపట్నంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఇమ్మడి రాణి సంయుక్త సుమారు రెండేళ్లుగా శారద హైస్కూల్ రోడ్డులో నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం విధులు ముగించుకుని కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఉంటున్న అన్నయ్య వద్దకు వెళ్లింది. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా, దాని పక్కనే మరోవైపు ఉన్న తలుపు తెరిచి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూసింది. గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు గ్రహించింది. బీరువా తెరిచి ఇంట్లో అంతా చిందర వందరంగా వస్తువులు, దుస్తులు పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలాన్ని సందర్శించి పోలీసులు వివరాలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాల సేకరించారు. ఇంట్లోని 70 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదు, కేజీన్నర వెండి వస్తువులు, పట్టు చీరెలు అపహరణకు గురయ్యాయని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ పి రమేష్ తెలిపారు.
సుమారు రూ.13 లక్షలు అపహరణ