
నీటి మోటార్ల దొంగలు అరెస్ట్
నాలుగు మోటార్లు స్వాధీనం
వేటపాలెం: పొలాల్లో సాగు నీటికి ఉపయోగించే మోటార్లు దొంగిలించే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పి.జనార్దన్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొత్తపాలేనికి చెందిన రైతు మర్రి నాగార్జున తమ పంట పొలాలకు ఉపమోగించి నీటి మోటార్లు దొంగతనాకి గురైట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కొణిజేటి చేనేత కాలనీలో నివాసం ఉంటున్న షేక్ నాసిర్ వాలి, వేటపాలెం మార్కెట్ సెంటర్‌లో నివాసం ఉంటున్న షేక్ సుభాని.. ఇద్దరు చెడు వెసనాలకు అలవాటు పడి పొలాల్లో ఉండే మోటార్ల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ మేరకు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 5 హెచ్‌పీ మోటార్లు మూడు, 2 హెచ్‌పీ మోటార్లు రెండు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ.1.10 లక్షలు ఉంటుందన్నారు. నిందితులిద్దరినీ చీరాల కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.
15న జిల్లా అథ్లెటిక్ జట్టు ఎంపిక
గుంటూరు వెస్ట్ ( క్రీడలు ) : అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సింథటిక్ ట్రాక్‌లో ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్‌తోపాటు వయస్సు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్టును ఆగస్ట్‌లో బాపట్లలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు.
నేడు అండర్–14 పికిల్ బాల్ పోటీలు
వివివి హెల్త్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని క్లబ్‌లో అండర్– 14 బాల బాలికల ఓపెన్ పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తామని క్లబ్ డైరెక్టర్ టి.అరుణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
విత్తన దుకాణాల్లో తనిఖీలు
కొరిటెపాడు (గుంటూరు): జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 40 మంది అధికారులను 13 టాస్క్‌ఫోర్స్ బృందాలుగా ఏర్పాటు చేసి ఏకకాలంలో తనిఖీలు చేశారు. గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని పలు విత్తన దుకాణాలు, మాన్యుఫాక్చరింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు, రిటైల్, హోల్ సేల్ దుకాణాల్లో శనివారం ఈ తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగుతున్నట్లు గమనించామని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఆ విత్తనాల అమ్మకాలను నిలిపివేశామన్నారు. రూ.4.72 కోట్ల విలువైన 704.84 కిలోల మిర్చి విత్తనాలు, రూ.5.65 లక్షల విలువ గల మరో 293.85 కిలోల ఇతర విత్తనాల అమ్మకాలను నిలిపివేశామని పేర్కొన్నారు.