
పాఠశాలకు పూర్వవైభవం తెస్తాం
యడ్లపాడు లూథరన్ హైస్కూల్ పూర్వవిద్యార్థులు
యడ్లపాడు: వందలాది మంది విద్యార్థులతో కళకళలాడుతూ దర్శనమిచ్చే యడ్లపాడు లూథరన్ హైస్కూల్ ఖాళీ తరగతి గదులతో వెలవెలబోతోందని పూర్వవిద్యార్థుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక పూర్వ విద్యార్థుల సంఘం, గ్రామపెద్దలు లూథరన్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఏఈఎల్‌సీ ప్రతినిధుల మాటల్ని నమ్మి, భావితరాల విద్యా భవితను దృష్టిలో ఉంచుకుని యడ్లపాడు కమిటీ హైస్కూల్ నిర్వహణ బాధ్యతల్ని మాత్రమే వారికి అప్పగించినట్లు తెలిపారు. ఏఈఎల్‌సీ నిర్లక్ష్య వైఖరితో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత 20 ఏళ్లుగా లూథరన్ హైస్కూల్‌లో ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లనే పాఠశాల భవనం పూర్తి శిథిలావస్థకు చేరిందని ఆరోపించారు. చివరకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. మండల కేంద్రంగానూ, పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యడ్లపాడు నుండి మెరుగైన ఆధునిక విద్యా వసతులు వెతుక్కుంటూ విభిన్న సామాజిక శ్రేణుల కుటుంబాల నుంచి విద్యార్థులు ఇతర గ్రామాలలోని పాఠశాలలకు వలస వెళ్లడం బాధాకరమన్నారు. ఈనేపథ్యంలో 15 ఏళ్ల క్రితమే పాఠశాల పూర్వవిద్యార్థులు సంఘటితమై దాని పూర్వవైభవానికై నడుం బిగించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే దాతల సహకారంతో రూ.40 లక్షలు సమీకరించి తరగతి, కార్యాలయ గదులపై స్లాబుల పునరుద్ధరణ పనులు, మౌళిక సదుపాయాలు, అలాగే హైవే నుంచి పాఠశాల వరకు ఉన్న ప్రధాన మార్గాన్ని ప్రభుత్వ నిధులచే సిమెంట్ రోడ్డుగా మార్చిన విషయాలను గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభ్యున్నతి కోసం గ్రామానికి చెందిన నాటి పెద్దల నిర్మించిన హైస్కూల్ గ్రామ ఉమ్మడి ఆస్తి అని, దీనిని ఎటువంటి ప్రేవేటు వ్యక్తుల ఆక్రమణకు గురికానివ్వమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థులు, హైస్కూల్ నిర్మించిన దాతల వారసులు, గ్రామపెద్దలు ముత్తవరపు రామారావు, నూతలపాటి కాళిదాసు, పోపూరి వెంకటరత్తయ్య, చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, బెజ్జం రాజశేఖర్, పి సునీల్, కాసు రామస్వామిరెడ్డి, చాగంటి చెంచారెడ్డి, నంబూరు శివరామకృష్ణ, జరుగుల అంజేశ్వరరావు, పోపూరి రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.