యడ్లపాడు: వివాహిత అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ వి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బోయపాలెంకు చెందిన వడ్డేపల్లి అశోక్‌కు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఇరిపని లక్ష్మీభార్గవి (23)కు 2018లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అశోక్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, భార్గవి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతకు తీయకపోవడంతో అనుమానంతో ఆమె ఆడపడుచు తలుపుకొట్టి తీసి చూడగా రేకుల షెడ్డు పైకప్పుకు వేసి ఐరన్‌రాడ్డుకు చీరెతో ఉరివేసుకుని కన్పించింది. పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా అప్పటికే లక్ష్మీభార్గవి మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలి ఆడపడుచు భర్త బాలాజీ ద్వారా విషయం తెలుసుకున్న మృతిరాలి తల్లి దుర్గ సోమవారం బోయపాలెం చేరుకుంది. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. వెంటనే బంధువులతో కలిసి యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి, మృతదేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఏడాది నుంచి భార్గవికి కడుపునొప్పి వేధిస్తుందని, దానిని తాళలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్గవి తల్లి తన ఫిర్యాదు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
అప్పులు కట్టలేక భార్యాభర్తల అదృశ్యం
అద్దంకిరూరల్: అప్పులు కట్టలేనని.. ఇంట్లో పుస్తకంలో రాసిపెట్టి భార్యాభర్తలు అదృశ్యమయ్యారు. ఈఘటన ఆదివారం అద్దంకి పట్టణంలో జరగ్గా భార్య, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు ఎస్‌ఐ ఖాదర్‌బాషా నమోదు చేశారు. ఎస్సై వివరాల మేరకు అద్దంకి పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన కుంచాల శ్రీనివాసరావుకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె అంజలికి మూడేళ్ల కిందట ఆలకుంట వెంకట్రావుతో వివాహం కాగా అద్దంకిలో ఉంటున్నారు. వెంకట్రావు బేల్దారి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ప్రస్తుతం అంజలి గర్భిణి. ఈ క్రమంలో ఆదివారం తల్లి తన కుమార్తె అంజలి ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ కనిపించలేదు. దీంతో కూతురు, అల్లుడు హాస్పటల్‌కు వెళ్లారని భావించి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే అద్దంకిలోని వైద్యశాలలో చూశారు. అక్కడా కూడా లేకపోవడంతో ఒంగోలులోని పలు వైద్యశాలలు వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో ఇంటికి వచ్చి అన్ని వెతకగా ఒక పుస్తకంలో తాము ఇవ్వాల్సిన అప్పుల జాబితా రాసి ఉంది. ‘అవి తాను కట్టలేనని తన ఇల్లు అమ్ముకుని అందరూ తీసుకోవాలని రాసి, తమకోసం వెతకవద్దు ఎవరికి కనబడం ’ అని ఉంది. బంధువుల వద్ద అడగ్గా తమవద్దకు రాలేదని చెప్పారు. అద్దంకిలోని గుండ్లకమ్మ నది ప్రాంతం అంతా వెతికారు. అయినా జాడ కనబడలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్యను హత్యచేసిన వ్యక్తికి జీవిత ఖైదు
చినగంజాం: భార్యను హత్యచేసిన కేసులో వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసులు సమాచారం మేరకు బాపట్ల జిల్లా చినగంజాంలోని మహాలక్ష్మి కాలనీకి చెందిన కత్తి శ్రీనుకు తన భార్య కత్తి దుర్గ(30)తో మనస్పర్థలు వచ్చాయి. భర్తతో విభేదించి ఆమె పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు మల్లవరపు అంజయ్య, రాఘవమ్మ ఇంట్లో తన పిల్లలతో ఉంటోంది. ఈ గొడవలు మనసులో పెట్టుకున్న శ్రీను గతేడాది జూన్‌లో దుర్గ ఉంటున్న ఇంటికెళ్లి కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. మృతురాలి తల్లి మల్లవరపు రాఘవమ్మ ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ బత్తుల శ్రీనివాసరావు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండుకు పంపారు. ఇప్పటి సీఐ వై.వి.రమణయ్య దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించారు. అనంతరం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.ప్రశాంతి కుమారి వాదనలతో ఏకీభవించిన ఒంగోలు మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి డి.రాములు నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.1600 జరిమానా విధించారు.