పెదకాకాని: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విద్యావతి శనివారం పెదకాకాని బాజీబాబా దర్గాను సందర్శించారు. పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి విద్యావతికి సిబ్బంది దర్గా మర్యాదలతో స్వాగతం పలికారు. దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేసిన న్యాయమూర్తి అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దర్గా సిబ్బంది న్యాయమూర్తి విద్యావతిని శాలువాతో సత్కరించారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉరుసు మహోత్సవం జరగనున్న నేపధ్యంలో రూ.5వేల నగదు విరాళంగా అందజేసినట్లు దర్గా సిబ్బంది తెలిపారు.
28 అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఎస్సీ, ఎస్టీ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 28 అర్జీలను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు స్వీకరించారు. తక్షణమే సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాల వారి సమస్యల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోని ప్రతినెలా నాల్గవ శనివారం ప్రత్యేక పీజీఆర్‌ఏస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆయా వర్గాల ప్రజలు ఉపయోగించుకోవాలి అన్నారు. జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ,, డీఆర్వో ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లోనే సహకార
సంఘాల లావాదేవీలు
నరసరావుపేట: ఇకపై సహకార సంఘాలలో అన్ని లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా శనివారం జిల్లా సహకార బ్యాంక్ ఆవరణలో పీఏసీలు, సీఈవోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. వాణిజ్య బ్యాంక్‌ల మాదిరి సహకార సంఘాలు పనిచేయాలన్నారు. అవసరమైతే తగిన ఫర్నిచర్ సమకూర్చుకోవాలని తెలిపారు. సభ్యులకు ఆన్‌లైన్ సేవలు అందించాలని చెప్పారు. గో లైవ్‌కు వెళ్లిన అన్ని పీఏసీలు ముందుగా నెట్‌వర్క్ పనితీరును పరీక్షించుకోవాలని చెప్పారు. సభ్యుల డేటా సరిగ్గా నమోదైందో లేదో లాగిన్ చేసి పరిశీలించుకోవాలని కోరారు. సిబ్బందిలో అవసరమైన వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సిస్టమ్ ఆడిట్‌లో భాగంగా అన్ని మాడ్యూల్స్ సరిగ్గా పని చేస్తున్నాయో లేదో పరీక్షించుకోవాలని సూచించారు. రియల్ టైం ఎంట్రీ ప్రారంభించాలని, ఏ రోజుకుకారోజు ఆన్‌లైన్ లావాదేవీలు సక్రమంగా చేస్తూ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. జిల్లాలో 59 పీఏసీలకుగాను 38 పీఏసీలలో గో లైవ్‌కు వెళ్లిన సీఇవోలు, జిల్లా సహకార ఆడిట్ అధికారి డి. శ్రీనివాసరావు, బ్యాంకు సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
బాజీబాబా దర్గాను సందర్శించిన హైకోర్టు జడ్జి