
క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసం ఆఖరి ఆదివారం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. ఆది దంపతులకు నిర్వహించిన పలు ఆర్జిత సేవలతో పాటు మల్లేశ్వర స్వామి వారికి నిర్వహించిన పలు సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్‌రోడ్డు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. నూతన వధూవరులు, అయ్యప్పలు, భవానీలు, శివ దీక్షధారణ చేసిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది. రూ.100, రూ.300, రూ.500 టికెట్ క్యూలైన్లలో భక్తుల తాకిడి కనిపించింది. మరో వైపున గంటగంటకు రద్దీ అధికం కావడంతో లిఫ్టులో భక్తులను మహా మండపం ఐదో అంతస్తు వరకే అనుమతించారు. మధ్యాహ్నం మహా నివేదన తర్వాత రద్దీ మరింత పెరిగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ భక్తుల తాకిడి కనిపించింది.
సూర్యోపాసన సేవ
ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
సహస్రలింగార్చన, ఊంజల్ సేవ
మల్లేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. నటరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని వేదికపై సహాస్ర లింగార్చన నిర్వహించగా, పలువురు భక్తులు సేవలో పాల్గొన్నారు. సాయంత్రం ఊంజల్ సేవ, దీపార్చన సేవ జరిగింది.
భక్తులతో కిక్కిరిసిన దుర్గమ్మ కొండ సర్వదర్శనానికి రెండు గంటలు కార్తిక మాసం చివరి ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు

ఆలయం ముఖమండపంలో భక్తుల రద్దీ