తాను మరణించినా మరో ఐదుగురికి జీవితం... | Sakshi
Sakshi News home page

తాను మరణించినా మరో ఐదుగురికి జీవితం..

Published Wed, Sep 27 2023 2:06 AM

- - Sakshi

మరణశయ్యపై అచేతనంగా పడి ఉన్న కొడుకును చూసి కన్నపేగు కదిలి కదిలి కలచివేస్తున్నా.. దుఃఖం పొగిలి పొగిలి తన్నుకొస్తున్నా.. తీరని కడుపుకోత దావానలంలా తనువులను దహించి వేస్తున్నా.. విధిపై ఆక్రోశం కన్నీటిధారలు కడుతున్నా.. అంతరంగాన రేగిన ఆర్తనాదం నిశ్శబ్దంగా దేహాలను కంపింపజేస్తున్నా.. గుండెలను పిండేసే పెనువిషాదాన్ని పంటిబిగువనే భరిస్తూ ఆ తల్లిదండ్రులు కొండంత ఔదార్యం చూపారు. తమ కొడుకు చనిపోయినా మరికొందరికి పునర్జన్మనివ్వాలని తలంచారు. అవయవదానానికి అంగీకరించి ఆదర్శమూర్తులుగా నిలిచారు.

గుంటూరు మెడికల్‌, చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా రాజు, మల్లేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం. రాజు తోపుడుబండిపై కూరగాయలు అమ్ముతూ, ఆటో నడుపుతూ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాడు. ప్రథమ సంతానం కృష్ణ (18) ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు సంతోష్‌ తొమ్మిదో తరగతి, మూడో కుమారుడు అభిషేక్‌ 8వ తరగతి చదువుతున్నారు. ఈనెల 23న కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కృష్ణను ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణ తలకు బలమైన గాయం కావడంతో తల్లిదండ్రులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు రమేష్‌ హాస్పిటల్‌కి తరలించారు.

కృష్ణకు ఈనెల 25న బ్రెయిన్‌ డెడ్‌ అయింది. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో గుండెలవిసేలా రోదించారు. చేతికంది వచ్చిన బిడ్డ తమను చూసుకుంటాడనుకునే సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. అంతటి బాధలోనూ తల్లిదండ్రులు గుండెను దిటవు చేసుకుని తమ బిడ్డ మరణం మరికొందరికి జీవితం ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు. బిడ్డ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. కృష్ణ ఈనెల 19న తన 18వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న నాలుగురోజుల్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని తల్లిదండ్రులు, స్నేహితులు విలపిస్తున్నారు.

ఐదుగురికి పునర్జన్మ
కృష్ణ నేత్రాలు గుంటూరు సుదర్శిని కంటి ఆస్పత్రికి, లివర్‌ను విశాఖపట్నం కిమ్స్‌ హాస్పిటల్‌కు, ఒక కిడ్నీని విజయవాడ ఆయుష్‌ హాస్పిటల్‌కు, మరో కిడ్నిని రమేష్‌ హాస్పిటల్‌కు, గుండెను తిరుపతి పద్మావతి హాస్పిటల్‌కి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా, గ్రీన్‌చానల్‌లో తరలించారు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉండి అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న ఐదుగురికి జీవితాలను ప్రసాదించనున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

తిరుపతి వ్యక్తికి గుండె
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌ ద్వారా గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుందని ఆగమేఘాల మీద హెలీకాప్టర్‌ను రప్పించి, గ్రీన్‌ చానెల్‌ ద్వారా శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు.

మరణంలోనూ పరోపకారం
కట్టా కృష్ణ నాకు మంచి మిత్రుడు. చిన్ననాటి నుంచి కలుపుగోలు స్వభావం కలిగినవాడు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. చివరకు మరణంలోనూ ఇతరులకు సహాయపడ్డాడు. మిత్రుడి మరణం తీవ్ర బాధ కలిగిస్తున్నా అతను చనిపోయినా ఇతరులకు ప్రాణదానం చేయడం గర్వంగా ఉంది.
– పాలపర్తి మోహనవంశీ, స్నేహితుడు

మంచితనానికి మారుపేరు
కృష్ణ మంచితనానికి మారుపేరు. బంధువులందరితో కలుపుగోలుగా ఉండేవా డు. ఈనెల 19న సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్నాడు. రోజుల వ్యవధిలోనే అందరినీ విడిచి కానరాని లోకాలకు వెళ్లడం మనసును కలచివేస్తోంది. అవయవ దానం ద్వారా ఐదుగురికి కొత్త జీవితాలు ఇచ్చిన కృష్ణతో స్నేహం, బంధుత్వం పంచుకోవడం గర్వంగా భావిస్తున్నా. 

– పాలపర్తి నాని, స్నేహితుడు, మేనమామ కుమారుడు


 

Advertisement
Advertisement