
సిబ్బందికి వెయిస్ట్‌కోటను పంపిణీ చేస్తున్న దృశ్యం
యడ్లపాడు: చారిత్రక కొండవీడుకోట ప్రాంతాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ గొప్ప మధురానుభూతిని కలిగించే పర్యాటక ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని పల్నాడు జిల్లా అటవీశాఖ అఽధికారి ఎన్ రామచంద్రరావు తెలిపారు. యడ్లపాడు మండలంలోని కొండవీడు కోట ప్రాంతాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు గుర్తించి ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వాగత ద్వారం పక్కనే కొండవీడు–నగరవనం గైడ్‌మ్యాప్ బోర్డును అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. కొండవీడుకోట సందర్శనకు వచ్చే వారికి కొండపై పర్యటించేందుకు ఈ మ్యాప్ వారికి గైడ్ చేస్తుందన్నారు.
అటవీ సిబ్బందికి డ్రస్‌కోడ్
కొండపై నిరంతరం పర్యవేక్షించే 20 మంది అటవీ సిబ్బందికి డ్రస్ కోడ్ (వెయిస్ట్‌కోటు)ను డీఎఫ్‌వో రామచంద్రరావు శుక్రవారం పంపిణీ చేశారు. సందర్శకులు అటవీ సిబ్బందిని సులభంగా గుర్తించి వారి సహాయాన్ని పొందేందుకు వీలుంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ, కొండవీడు బీట్ ఆఫీసర్ పురుషోత్తమరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి ఎన్ రామచంద్రరావు
కొండవీడుకోటను సందర్శించిన డీఎఫ్‌వో