
అమ్మవారి దర్శనానికి క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మరికొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. సాధారణ భక్తులు, ఆది దంపతులకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన ఉభయదాతలు, నూతన వధూవరులతో అమ్మవారి ఆలయ ప్రాంగణం కళకళలాడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. అమ్మవారికి అంతరాలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించే లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చనతో పాటు చండీహోమం, శాంతి కల్యాణం వంటి ఆర్జిత సేవల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఉదయం 9 గంటల తర్వాత రద్దీ మరింత పెరిగింది. ఉదయం 11.40 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తులు అరగంట పాటు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఎండ వేడిమి, వడగాడ్పుల నేపథ్యంలో క్యూలైన్‌లో కూలర్లు, ఫ్యాన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ చేశారు. రద్దీ నేపధ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబలు క్యూలైన్లను పర్యవేక్షించారు. సాయంత్రం అమ్మవారికి నిర్వహించిన పంచహారతుల సేవలో భక్తులు పాల్గొనగా, ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ, దర్బారు సేవను ఆలయ అర్చకులు నిర్వహించారు.
దుర్గమ్మ సేవలో అన్‌స్టాపబుల్ చిత్ర యూనిట్
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను అన్‌స్టాపబుల్ చిత్ర యూనిట్ శుక్రవారం దర్శించుకుంది. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన చిత్ర హీరో, బిగ్‌బాస్ సన్నీ, సప్తగిరి, నిర్మాత రంజిత్‌రావులతో పాటు మరి కొంత మంది విచ్చేయగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, చైర్మన్ కర్నాటి రాంబాబు ప్రసాదాలను బహూకరించారు.