నరసరావుపేట: శాంతిభద్రతల పరిరక్షణ. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణే ప్రథమ కర్తవ్యంగా జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన నేరసమీక్షలో పీజీఆర్‌ఎస్, పోస్కో, గ్రేవ్, ప్రాపర్టీ, చీటింగ్, 174 సీఆర్‌పీసీ, మిస్సింగ్ కేసులు, గంజాయి, నాటుసారా కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను హేతుబద్ధంగా విశ్లేషించి తగ్గించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సున్నితమైన భాషతో మాట్లాడాలని, వారితో మమేకమై సమస్యలను ఓపికగా విని, బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని అన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు
మహిళలు, బాలికలు, చిన్నారుల ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, వారికి సంబంధించిన కేసుల విచారణ సమయంలో తప్పనిసరిగా మహిళా పోలీస్ అధికారి, సిబ్బంది ఉండేటట్లుగా చూసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టిసారించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. 112 ఎమర్జెన్సీ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాల్ వచ్చిన సమయం, సంఘటన స్థలానికి చేరుకున్న సమయాన్ని పరిగణలోకి తీసుకొని నిర్లక్ష్యంగా స్పందించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా తయారీ, క్రయ విక్రయాలపై నిఘా వుంచి వాటిని ఎప్పటికప్పుడు అరికట్టాలని, ఆ ప్రదేశాలలో కార్డన్ అండ్ సెర్చ్‌లు, దాడులు నిర్వహించాలన్నారు. ఈ నెలలో ఈపూరు, ముప్పాళ్ళ, చిలకలూరిపేట రూరల్, నరసరావుపేట వన్‌టౌన్‌లోని ఐదు కేసులలో కోర్టు శిక్ష విధించడం ఆనందంగా ఉందన్నారు.
ఏపీపీ, పీపీలకు అభినందనలు
ఈసందర్భంగా నరసరావుపేట వన్‌టౌన్‌లో తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముళ్లపందికి జీవిత ఖైదు, మరణ శిక్షతో పాటు పలు స్టేషన్లలోని కేసులకు జీవిత ఖైదు, శిక్షలు వేయించడానికి కృషిచేసిన ఏపీపీ దేశిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండీ సిరాజుద్దీన్, సీనీయర్ ఏపీపీ లాల్‌సింగ్ లక్ష్మీరాం నాయక్‌లను సన్మానించి మెమొంటోతో సత్కరించారు. అలాగే ప్రతిభ కనబరిచిన కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు, క్రైం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు. అదనపు అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్, డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
నేర సమీక్షలో పోలీసు అధికారులకు సూచించిన జిల్లా ఎస్పీ ఏపీపీ, పీపీలకు సన్మానం