
బాపట్ల: ఢిల్లీలో ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే జాతీయ స్థాయి ఈత పోటీలకు బాపట్ల జూనియర్ కళాశాల విద్యార్థి ఉప్పాల జ్ఞానవివేక్‌గౌడ్ ఎంపికయ్యాడు. ఈ సంవత్సరం జనవరిలో తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి ఈత పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లా తరుపున పాల్గొన్న వివేక్ రెండు వెండి పతకాలు సాధించాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే పోటీలలో పాల్గొనడానికి అవకాశం దొరికింది. వివేక్‌గౌడ్ జాతీయపోటీలకు ఎంపిక కావటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
సూర్యలంక తీరంలో
వృద్ధుడు ఆత్మహత్యాయత్నం
బాపట్లటౌన్: సూర్యలంక సముద్రంలో మునిగి వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం సూర్యలంక సముద్రతీరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సుమారు 60 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధుడు సూర్యలంక సముద్రతీరానికి వచ్చి అందరూ మునిగే ప్రదేశంలో కాకుండా దూరంగా వెళ్లి సముద్రంలోకి దిగాడు. అతడి ప్రవర్తనను గమనించిన తీరంలోని అవుట్ పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎం.పోతురాజు, కానిస్టేబుల్ పి.వెంకటరావు, హోంగార్డు ఎన్.నరసింహమూర్తి, గజ ఈతగాళ్లు సుబ్బారావు, కోటయ్యలు వెంటనే స్పందించి సముద్రంలోకి వెళ్లి వృద్ధుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఎండ ప్రభావంతోపాటు ఉప్పునీరు తాగడం వలన వృద్ధుడు నీరసంగా ఉండటాన్ని గమనించి వెంటనే ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వృద్ధుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. వెంటనే స్పందించి వృద్ధుడిని కాపాడిన సిబ్బందిని, గజ ఈతగాళ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
తొలకరికి ముందుగా
యాజమాన్య పద్ధతులు చేపట్టాలి
గుంటూరురూరల్: రైతు లు తొలకరిలో ముంద స్తు యాజమాన్య పద్ధతులు చేపట్టి ఆరోగ్యకరమైన అధిక దిగుబడులను సాధించవచ్చని లాంఫాం కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గంగాదేవి తెలిపారు. శుక్రవారం నగర శివారుల్లోని కేవీకేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రైతుకి దుక్కి నుంచి దిగుబడుల వరకు ఏది అవసరమో ముందుగా గుర్తుంచి పకడ్బందీ ప్రణాళిక పర్యవేక్షణ వల్లనే పంటదిగుబడి పెరిగి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించగలరని తెలిపారు. రైతులకు ఇది ఖరీఫ్ సాగుగుకు సన్నద్ధమయ్యేందుకు సరైన సమయమని వివరించారు. ఖరీఫ్ పంటకాలం ప్రారంభంలో రైతులు వేసవి దుక్కులపై శ్రద్ధ పెట్టాలని కోరారు. భూసార పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. భూసారం పెంపునకు పశుగ్రాసాన్ని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలని చెప్పారు. భూసార పరిరక్షణకు సేంద్రియ ఎరువులు ఎంపిక చేసుకోవాలని సూచించారు.

శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి
