
మంగళగిరి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడిని వెంటాడి నరికి చంపిన దారుణ ఘటన శుక్రవారం మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇటీవల నవులూరు ఎంఎస్‌ఎస్ కాలనీలో రెండేళ్ల పాప లక్ష్మీ పద్మను తండ్రి గోపి నేలకేసి కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. గోపి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోపీని అదుపులోకి తీసుకుని నాలుగు రోజులుగా స్టేషన్‌లోనే ఉంచి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపి మేనమామ శివన్నారాయణ, మేనమామ కుమారుడు వెంకటకృష్ణ రోజూ స్టేషన్‌కు వచ్చి గోపీని కలుస్తున్నారు. ఇంటికి వెళ్లి గోపిపై ఫిర్యాదు వెనక్కి తీసుకుని అతడిని విడిపించాలని మౌనికపై ఒత్తిడి తెస్తున్నారు. మౌనిక పిన్ని కొడుకు వరహాల సాయిసందీప్(34) ఫిర్యాదు వెనక్కి తీసుకోవద్దని మౌనికకు అండగా నిలబడ్డాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గోపి నివాసంలో సందీప్ తో శివన్నారాయణ, వెంకటకృష్ణ గొడవకు దిగారు. సందీప్ ఆవేశంలో శివన్నారాయణను నెట్టడంతో శివన్నారాయణ గోడ మీద పడ్డాడు. అతడికి గాయమైంది. ఇది చూసిన శివన్నారాయణ కుమారుడు వెంకటకృష్ణ ఇంటిలోని కొబ్బరిబొండాలు నరికే కత్తితో సందీప్ వెంటపడ్డాడు. గోపి ఇంటి వద్ద నుంచి సందీప్ పరిగెత్తగా వెంకటకృష్ణ వెంటపడి కిలోమీటరుకుపైగా దూరం ఉన్న అమరావతి టౌన్‌షిప్‌లోని క్రికెట్ స్టేడియం పక్కన కల సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద కత్తితో మెడమీద నరికాడు. దీంతో సందీప్ కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో వెంటనే చేరుకున్న పోలీసులు కొన ఊపిరితో ఉన్న సందీప్‌ను చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులు శివన్నారాయణ, వెంకటకృష్ణ పోలీసులకు లొంగిపోవడంతో సందీప్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.