
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం గుంటూరు పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లోని హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. వైఎస్సార్ సీపీ నేతలతోపాటు అధికారులు, ప్రముఖులు తరలివచ్చి సీఎంకు పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్ శామ్యూల్, గుంటూరు రేంజ్ ఐజీ జి.పాల్‌రాజ్, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చుట్టుగుంట సభాస్థలి వద్ద కూడా కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు సాదర స్వాగతం పలికారు. జేసీ జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, అడిషనల్ ఎస్పీ కె.సుప్రజ తదితరులు ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు.
కోటప్పకొండ ఇన్‌చార్జి ఈఓగా శ్రీనివాసరెడ్డి
మార్కాపురం: పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారిగా మార్కాపురం లక్ష్మీచెన్నకేశవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి గొలమారి శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కోటప్పకొండ ఆలయాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, త్వరలో బాధ్యతలు స్వీకరిస్తానని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
టెన్త్ సప్లిమెంటరీ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 27 పరీక్షా కేంద్రాల పరిధిలో 438 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ గుంటూరు నగర పరిధిలో నాలుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అదే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 11 పరీక్షా కేంద్రాలతో పాటు ఒక స్టోరేజ్ పాయింట్‌ను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
నిరుద్యోగ యువతకు
ఉచిత నైపుణ్య శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. ప్రణయ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ ద్వారా ఇంటర్ విద్యార్హత గల వారికి అసోసియేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, టెన్త్ అర్హతతో అసెంబ్లీ ఆపరేటర్ (ఆర్‌ఏసీ) కోర్సుల్లో ఉచిత శిక్షణ కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఆసక్తి కలిగిన 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఏపీ ఎస్‌ఎస్‌డీసీ సైట్‌తో పాటు తమ ప్రతినిధి బి. రవికుమార్‌ను 63042 92828 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
91.82 శాతం ఫించన్ల పంపిణీ
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి శుక్రవారం వైఎస్సార్ పెన్షన్ కానుక అందజేశారు. వేలిముద్రలు, ఐరిస్ ఆధారంగా వలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో శుక్రవారం నాటికి 91.82 శాతం పంపిణీ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో 2,51,264 మంది లబ్ధిదారులు ఉండగా వారి కోసం ప్రభుత్వం రూ.69.02 కోట్లు కేటాయించింది. శుక్రవారం సాయంత్రానికి 2,30,708 మంది లబ్ధిదారులకు రూ.63.39 కోట్ల నగదు అందజేశారు.
విద్యాశాఖ వెబ్‌సైట్‌లో
ఎన్‌ఎంఎంఎస్ ఫలితాలు
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు గత ఫిబ్రవరి 5న నిర్వహించిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షా ఫలితాలను విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షా ఫలితాలను డీఈవో కార్యాలయంతో పాటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని, అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ కార్డులు త్వరంలో డీఈవో కార్యాలయానికి చేరుకుంటాయని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు తమ తల్లి, తండ్రితో జాయింట్‌గా సేవింగ్స్ ఖాతా తెరవాలని సూచించారు.