
శనివారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2023
సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్, పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ యంత్ర సేవా పథకం రెండో విడత పంపిణీకి గుంటూరు చుట్టుగుంట వరుసగా రెండో ఏడాదీ వేదికైంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆద్యంతం అట్టహాసంగా జరిగిన యంత్రాల పంపిణీకి అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చారు. సంక్షేమ రేడును చూసేందుకు పోటీపడ్డారు. తొలుత వేదిక వద్దకు చేరుకోగానే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్రాక్టర్‌తోపాటు, హార్వెస్టర్‌ను నడిపి అందరినీ సంబరమాశ్చర్యాలకు గురిచేశారు. అనంతరం రాష్ట్రంలోని లబ్ధిదారులకు రూ.361.29 కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్డ్ హార్వెస్టర్లు, 13,573 వ్యవసాయ పరికరాల పంపిణీ ప్రారంభించారు. వీటికి సంబంధించి రూ.125.48 కోట్ల సబ్సిడీ సొమ్మును బటన్ నొక్కి నేరుగా రైతు గ్రూపుల ఖాతాల్లోకి జమ చేశారు. రోహిణీకార్తె నేపథ్యంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో కార్యక్రమ సమయాన్ని కుదించారు. ముఖ్యమంత్రి వేదిక మీదకు చేరుకున్న తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వెంటనే నేరుగా రైతులనుద్దేశించి ప్రసంగించారు. కేవలం ఆరు నిమిషాల్లోనే తన ప్రసంగం ముగించారు. వాహనాల పంపిణీని ప్రారంభించారు.
రైతులకు సకల సదుపాయాలు
నగరానికి విచ్చేసిన రైతులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. మార్కెట్ యార్డు నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు 20 వాటర్ పాయింట్లు ఏర్పాటు చేసి రైతుల దాహార్తిని తీర్చింది. 5వేల మజ్జిగ ప్యాకెట్లు, 5 వేల స్నాక్స్ ప్యాకెట్లను అధికారులు పంపిణీ చేశారు. ఎనిమిది జిల్లాల నుంచి రైతులు ఒకరోజు ముందుగానే గుంటూరుకు చేరుకోవడంతో వారికి కావాల్సిన అన్ని వసతులతోపాటు, భోజన సదుపాయాన్ని జిల్లా యంత్రాంగం మిర్చియార్డులో సమకూర్చింది.
రైతుల ఆనందోత్సాహాలు
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో యంత్రాలు తీసుకోవడంతో రైతుల మోముల్లో చిరునవ్వులు వెల్లివిరిశాయి. చుట్టుగుంట నుంచి యార్డు వరకు కర్షకులు వరుసగా వాహనాలపై నిలబడి ఆనందోత్సాహాలు చేశారు. జయహో జగన్ అంటూ జయజయధ్వానాలు పలికారు. తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్‌ను తదేకంగా చూస్తూ పదికాలల పాటు చల్లగా ఉండాలని దీవించారు. వాహనాలు వెళ్లే క్రమంలో ఏలూరు కొత్తముప్పర్రుకు చెందిన ఒక రైతు కుమారుడు గుర్రం శేఖర్ ముఖ్యమంత్రిని ఒక్క నిమిషం కలవాలని కోరడంతో అతడిని సీఎం అనుమతించారు. తాను అగ్రికల్చర్ పాలిటెక్నిక్, బీఏ చేశానని తనకు ఏదైనా ఆధారం చూపాలని కోరడంతో అతనికి ఉద్యోగం ఇవ్వాలని ఏలూరు కలెక్టర్‌ని సీఎం ఆదేశించారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నేతలు
కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి అంజద్ బాషా, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకష్ణారెడ్డి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకష్ణ ద్వివేది, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా, కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ కమిషనర్ హరికిరణ్, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, కేఎస్ లక్ష్మణరావు, కల్పలతా రెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శాసన సభ్యులు మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్, అన్నాబత్తుని శివ కుమార్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే), మేకతోటి సుచరిత, నంబూరు శంకరరావు, కిలారి వెంకటరోశయ్య, ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నల్లమోతు శివరామకృష్ణ, జేసీ జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణశర్మ, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, డీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారాంజనేయులు, నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్లు సజిల, బాల వజ్రబాబు, పార్టీ నాయకులు తాడిశెట్టి మురళీమోహన్, కత్తెర సురేష్ పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
మండుటెండలో చల్లని స్పర్శ ఏదో స్పృశించినట్టు.. గుంటూరు పుడమితల్లి పులకించింది. ముత్యాల జల్లేదో కురిసినట్టు.. కర్షక సోదరులు పరవశించారు. వరాల తెమ్మెర సుతారంగా చెక్కిళ్లను తాకినట్టు.. లబ్ధిదారుల మోమున చిరునవ్వులు వికసించాయి. సంక్షేమ సూర్యుడే దిగివచ్చి సేద్యరథ సారథ్యం స్వీకరించినట్టు.. హలధారులు సంబరమై వెంట కదంతొక్కారు. ఖరీఫ్ సంరంభానికి సమరశంఖం పూరించినట్టు.. రైతు కనులు వెలుగుదివ్వైలె మెరిశాయి. ‘మిషన్’ కర్షక నినాదం మిన్నంటినట్టు.. సేద్యరంగం గళమెత్తి జయజయధ్వానాలు చేసింది.
కన్నుల పండువగా యంత్ర సేవా పథకం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చేతుల మీదుగా ప్రారంభం
రైతులకు యంత్రాలు అందజేసిన సీఎం
ట్రాక్టర్, హార్వెస్టర్ నడిపి
అబ్బురపరిచిన వైనం
బారులు తీరిన వాహనాలు
రైతుల మోముల్లో ఆనందం





రైతు రథసారథి : వరి కోత యంత్రాన్ని నడుపుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి