కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం (ఫైల్)
కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ పాలకవర్గ వివాదానికి తెర
నెహ్రూనగర్: కోర్టుల చుట్టూ తిరుగుతున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ వ్యవహారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జోక్యంతో కొలిక్కివచ్చింది. దీంతో నూతన కమిటీ ఏర్పాటు కు మార్గం సుగమమైంది. వివరాల్లోకి వెళితే...
గుంటూరు నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒకటి. ఆర్.అగ్రహారం కేంద్రంగా గుంటూరుకు తలమానికమే కాకుండా ప్రత్యేకించి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఈ ఆలయం పరమ పవిత్రమైన పుణ్యథామంగా విరాజిల్లుతోంది. అత్యంత మహిమాన్వితురాలిగా అందరూ విశ్వసించే అమ్మవారిని నిత్యం తలిచి కొలిచి తరిస్తుండడం వారికి అనాదిగా వస్తోంది. ప్రధానంగా మహిళలు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడా న్ని ఒక సెంట్‌మెంట్‌గా భావిస్తుంటారు. దీంతో ఆలయ ప్రాశస్త్యం దినదినాభివృద్ధి చెంది దేశ విదేశాల్లో సైతం పేరు ప్రఖ్యాతులు పొందింది. తద్వారా విశేషమైన కీర్తికాంతులతో పాటు ఆలయ కమిటీ చుట్టూ విపరీతమైన ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి.
అమ్మవారి దేవస్థానంలో కమిటీ పెత్తనం బాగా మితిమీరిందనీ, ఆలయం కమిటీ సభ్యుల ఇష్టారాజ్యంగా మారిందనీ, వారు ఆడిందే ఆట, పాడిందే పాట అనీ... ఇలా బోలెడన్ని ఆరోపణలు, వాటికి దేవస్థానం కమిటీ ప్రత్యారోపణల తో గుంటూరు నగరం మార్మోగిపోయింది. దీని పై ఆర్యవైశ్య పెద్దలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఎందరో జోక్యం చేసుకుని వ్యవహారాన్ని సర్దుబాటు చేద్దామని చూసినా అది చినికిచినికి గాలివానే అయింది తప్ప వివాదం సర్దుమణగ లేదు.
ఈ క్రమంలో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మహ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఆర్యవైశ్య ప్రముఖులు కోరిన మీదట ఎమ్మెల్సీ అప్పిరెడ్డి జోక్యం చేసుకుని ఆలయ వివాదంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ బృందావన్ గార్డెన్స్‌లోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి, చర్చించి ఎట్టకేలకు వివాదానికి తెరదించారు.
2014లోనే కోర్టు స్టే తెచ్చుకున్న మేడా సాంబశివరావు, తాజాగా స్టే తెచ్చుకున్న దేవరశెట్టి చిన్నిలతో ప్రత్యేకంగా మాట్లాడి వివాదానికి ముగింపు పలికారు. అంతేకాక వారిద్దరితో కోర్టులో కేసులు ఉపసంహరించడంతో నూతన కమిటీ ఏర్పాటుకు ఒక చక్కటి పరిష్కారం లభించినట్లయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మ వారి దేవస్థానం నూతన కమిటీ నియామకానికి సంబంధించిన దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతూ ఆన్‌లైన్లో 13వ తేదీన నోటిఫికేషనన్ విడుదలైంది. ఆసక్తి గల వారు నోటిఫికేషన్ విడుదలైన 20 రోజుల గడువులో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చాలా కాలం తర్వాత నియమనిబంధనలకు అనుగుణంగా ఒక నూతన కమిటీ ఏర్పడేందుకు మార్గం సుగమం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జోక్యంతో నూతన కమిటీ ఏర్పాటుకు మార్గం సుగమం ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం


