మందస : అభివృద్ధి ముసుగులో కార్పొరేట్లకు రైతుల భూములు కట్టబెట్టడానికి కార్గో ఎయిర్‌పోర్టు పేరిట పక్కా స్కెచ్ వేశారని రైతు సంఘం నాయకుడు బత్తిన లక్ష్మణ్ మండిపడ్డారు. మందస మండలం హరిపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలకు పలు ప్రశ్నలు సంధించారు. ఉద్దానం ప్రాంత రైతాంగం సమస్యలు మీకు తెలియవా? తరతరాలుగా కొబ్బరి, జీడితోటలపైనే ఆధారపడి బతుకుతున్నామని, అలాంటి భూములను లాక్కుంటే తమ బతుకులు వీధిన పడవా? అని ప్రశ్నించారు. కొబ్బరి చెట్టు ఫలసాయం ఇవ్వాలంటే కనీసం ఏడేళ్లు పడుతుందని, జీడి చెట్టు కాపు కాయాలంటే ఐదేళ్లు పడుతుందని, అలాంటి భూములను లాక్కుంటే కుటుంబ పోషణ ఎలా సాధ్యమన్నారు. జిల్లాలో 12 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయన్నారు. వజ్రపుకొత్తూరు మండలం సీతానగరంలో 1875 ఎకరాలు, పలాస వద్ద 800 ఎకరాలు, భావనపాడులో 5000 ఎకరాలు, మూలపేట వద్ద 1500 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నా తమ భూములపై కన్ను పడటం వెనుక కార్పొరేట్ కుట్ర దాగుందని ఆరోపించారు. సమావేశంలో దున్న హరికృష్ణ, బెలమర జీవన్ తదితరులు పాల్గొన్నారు.


