జయపురం: విద్యార్థులకు గుణాత్మక విద్య అవసరమని ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. సోమవారం సాయంత్రం జయపురం సబ్ డివిజన్ కోట్‌పాడ్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్ తరపున బండిగుడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో కోట్‌పాడ్ సమితి, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ ప్రాంతాల్లో 10వ తరగతి, సీబీఎస్‌ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. విద్యార్థుల ఫలితాల్లో తల్లిదండ్రుల కృషి అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జయపురం విక్రమ విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయిక్, కోట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్(ఎన్‌ఏసీ) చైర్మన్ ఎం.శంకరరావు, సీనియర్ న్యాయవాది పంకజ కుమార్ పాత్రో, మాజీ బీడీవో గోదావిరిస్ ఆచార్య, విశ్రాంత ఉపాధ్యాయుడు అనాది సాహు తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలోకి రెడ్‌క్రాస్ సేవలు
మల్కన్‌గిరి: రెడ్‌క్రాస్ సేవలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధన్ అన్నారు. జిల్లాలో సామాజిక సేవ, సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు మల్కన్‌గిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిధుల సేకరణను విస్తరించడం, వేగవంతం చేయడం లక్ష్యంగా జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ లక్ష్యమన్నారు. రెడ్‌క్రాస్ నిర్వహించే శిబిరాల ద్వారా సేకరించిన రక్తాన్ని విపత్తుల సమయంలో అవసరమైన వారికి అందించేందుకు దోహదపడుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరథి సరాబు, రెడ్‌క్రాస్ అధ్యక్షుడు రంజాన్ స్వయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చెట్టుపైకి ఎక్కి చనిపోతానని బెదిరింపు
రాయగడ: సదరు సమితి చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల జేకే పేపర్ మిల్ సమీపంలో ఓ యువకుడు చెట్టెక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మంగళవారం నాడు పేపర్ మిల్ నాల్గో గేటు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెట్టు పైకి ఎక్కిన యువకుడు అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని కేకలు వేయడంతో అక్కడ గల జేకేపేపర్ మిల్ సెక్యూరిటీ సిబ్బంది చూసి వెంటనే కంపెనీకి చెందిన సెక్యూరిటీ అధికారి దీపక్ కుమార్ సామల్‌కు తెలియజేశారు. అప్రమత్తమైన అధికారి వెంటనే చందిలి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే కొలనారలో గల అగ్నిమాపక సిబ్బందిని రప్పించి యువకుడిని చెట్టుపై నుంచి కిందకు దింపే ప్రయత్నం చేశారు. అయితే తనను పట్టుకునేందుకు వస్తే తాను వెంటనే చెట్టు పై నుండి కిందకి దూకుతానని బెదిరించడంతో దిక్కుతోచని సిబ్బంది అతడిని వారించే ప్రయత్నం చేశారు. సుమారు రెండు గంటల సమయం అతడిని బుజ్జగించి చెట్టు పై నుంచి కిందకు దింపారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. టికిరపడ గ్రామానికి చెందిన ఆ యువకుడు తన వ్యక్తిగత సమస్యల కారణంగా ఇలా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ యువకుడిని బుజ్జగించిన పోలీసులు ఇంటికి అప్పగించారు.


