● ఇద్దరికి గాయాలు ● పోలీలకు తల్లిదండ్రుల ఫిర్యాదు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య శనివారం రాత్రి కొట్లాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్ధులు తీవ్రగాయాలకు గురయ్యారు. దీనికి సంబంఽధించి బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు అంబొదల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న కొంతమంది సీనియర్ విద్యార్థులు శనివారం రాత్రి అదే పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటున్న కొంతమంది విద్యార్థులపై దాడి చేశారు. మంచాలకు కట్టిఉన్న దోమతెరలు ఇనుప ఊచలతొ దాడి చేయడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలకు గురయ్యారు. గాయాలకు గురైన వారిని ఎనిమిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. వీపు, కాళ్లపై వీరికి గాయాలయ్యాయి. కాగా తాము దాడి చేసినట్లుగా ఎవరికై నా చెబితే ఇదేతరహా మళ్లీ దాడి చేస్తామని దాడికి పాల్పడిన విద్యార్థులు హెచ్చరించారు. అయితే తమకు జరిగిన దాడి విషయమై బాధిత విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు హాస్టల్ నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే అటువంటిదేమీ లేదని వారు సంఘటనను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇటవంటి తరహా ఘటనలు ఇక్కడ తరచూ జరుగుతున్నప్పటికీ నిర్వాహకుల్లో ఎటువంటి స్పందన లేకపొవడంతో ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.


