జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ఫల్గునీ మఝి
పర్లాకిమిడి: ట్రాన్స్‌జెండర్లు స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకోవాలని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ఫల్గునీ మఝి అన్నారు. వీరు కూడా మగ, ఆడ వారి వలే సమాజంలో స్వతంత్రంగా, గౌరవపూర్వకంగా జీవించే హక్కు సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు మేరకు కలిగి ఉన్నారన్నారు. స్థానిక కలెక్టరేట్ నాలుగో హాల్‌లో అంతర్జాతీయ తృతీయలింగ దృశ్యమాన్యత దినోత్సవం 2025–26ని మంగళవారం జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అంతకు ముందు పర్లాకిమిడి మహారాజా బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఏడీఎం ఫల్గునీ మఝి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ పట్టణ పురవీధులతో పాటు కలెక్టరేట్ వరకూ సాగింది. అనంతరం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జిల్లా సామాజిక సురక్షా అధికారి ఉత్సర్‌గీతా బోడోరయితో అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో ఏడీఎం ఫల్గునీ మఝి, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఒడిశా జీవనోపాధుల శాఖ అధికారిని శివాణీ పాణిగ్రాహి, ఎస్‌డబ్ల్యూడబ్ల్యూఎస్ టీఐ అధికారి సునీత, ట్రాన్స్‌జెండర్స్ సంఘం కార్యదర్శి జాస్మిన్ షేక్, అధ్యక్షురాలు మధుబోరాడో, ఆదనపు తహసీల్దార్ కిసాన్ బెహారా, జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ అధికారి లక్కోజు సంతోష్ కుమార్ పాల్గొన్నారు. గజపతి జిల్లాలో 79 మంది హిజ్రాలు ఉండగా అందులో 38 మందికి గుర్తింపు పత్రాలు అందజేశామని సబ్ డివిజనల్ సామాజిక సురక్షా అధికారిని ఉత్సర్‌గీతా బోడోరయితో తెలియజేశారు. జిల్లాలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లకు స్వయం సహాయక గ్రూపుగా గుర్తించి రూ. 2.50 లక్షల ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు. అలాగే 20 మంది హిజ్రాలకు ప్రభుత్వ మధుబాబు పింఛన్ పథకం ద్వారా నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. హిజ్రాలకు ప్రభుత్వ పరంగా వారికి టెర్రకోటా బొమ్మలు తయారుచేసి అమ్మడానికి వారికి నెలరోజుల పాటు శిక్షణ అందజేశామన్నారు. హిజ్రాలపై దాడులు చేసే వారిపై తగు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ అనుప్‌పండా అన్నారు. వారికి సమాజంలో సమాన హక్కులు కల్పించడంతోపాటు విద్య, ఉపాధి, ఆరోగ్యం, వాణిజ్యం చేసుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు. అందువల్ల యాచక వృత్తికి దూరంగా ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి పథకాలు అందిపుచ్చుకోవాలని ఏడీఎం మఝి అన్నారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు.


