పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రామ ముఖిపరిపాలన, గ్రీవెన్స్‌సెల్‌కు మంచి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు, జిల్లా పరిషత్తు ఆదనపు ముఖ్యకార్యనిర్వాహణాధికారి దయామయ పాఢి, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 45 వినతులు అందగా.. వాటిలో ఆరు వ్యక్తిగతం, 39 గ్రామసమస్యలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. ఆర్.ఉదయగిరి పంచాయతీలో గ్రామీణ త్రాగునీరు, వృద్ధాప్య పింఛన్లు, పీఎం ఆవాస్ యోజన పథకం క్రింద ఇళ్లు మంజూరు చేయాలని వినతులు అందాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్.ఉదయగిరి సమితి అధ్యక్షులు లక్ష్మీనారాయణ శొబోరో, తహసీల్దార్ జ్యోతిర్మయి దాస్ ఉన్నారు.
చిత్రకొండ సమితిలో 77 వినతులు..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వభీమాన్ ఏరియాలోని జాంత్రీ పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే గ్రీవెన్స్‌సెల్‌ను సోమవారం నిర్వహించగా.. 77 వినతులు స్వీకరించారు. వాటిలో కొన్ని అక్కడికక్కడే పరిష్కరించగా.. మరికొన్ని వినతుల ను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆ శాఖా ల అధికారులను ఆదేశించారు. అనంతరం జాంత్రీ పంచాయతీలోని మాన్సూర్ వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జాంత్రీ–బిశోయిగూఢ, జాంత్రీ–దిశారిగూఢ గ్రామాల మధ్య జలాశాయం నుంచి వంతెన పనులు పూర్తి కోసం ఇంజినీర్లతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీ శాఖ అధికారి సాయికిరణ్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాభు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


