లక్ష్మణ్‌ నాయక్‌కు ఘనంగా నివాళులు | - | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌ నాయక్‌కు ఘనంగా నివాళులు

Mar 30 2026 7:27 AM | Updated on Mar 30 2026 7:27 AM

జయపురం: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు గిరిజన నేత సహిద్‌ లక్ష్మణ నాయక్‌ 84 వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ అధికారులు, వివిధ ప్రజా సంఘాల నేతలు ఘన నివాళులు అర్పించారు. పట్టణ ప్రధాన మార్గం గుప్తేశ్వర్‌ కాప్లెక్స్‌ ప్రాంగణంలో నెలకొల్పిన లక్ష్మణ నాయక్‌ విగ్రహానికి జయపురం సబ్‌డివిజన్‌ అధికారి సబ్‌ కలెక్టర్‌ తృప్తిమయి బరాల్‌ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆమెతో పాటు జయపురం సబ్‌ డివిజన్‌ సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీమతి యశోద గదబ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం జయపురం పూజ్యపూజ సంసద్‌ ప్రతినిధులు స్వాతంత్ర సమర యోధునికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంసద్‌ కార్యదర్శి తపన్‌ కిరణ్‌ త్రిపాఠీ మాట్లాడుతూ ఒక ఆదివాసీ కుటుంబంలో జన్మించిన లక్ష్మణ నాయక్‌ ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. తమ ప్రాంతంలో సారా బట్టీలపైన తన అనుచరులతో దాడులు జరుపుతూ ప్రజలను చైతన్యపరుస్తూ తిరుగు బాటుకు ప్రేరేపించారని తెలిపారు. మత్తిలిలో 1942 ఆగస్టు 21 వ తేదీన జరిగిన వారసంత నాడు వేలాది మంది ఆదివాసీ ప్రజలను సమీకరించి బహిరంగ సభలో మన నేత గాంధీ అని, మనకు స్వాతంత్రం వచ్చిందని ప్రకటించి మత్తిలి పోలీసు స్టేషన్‌ పై దాడికి వెళ్తుండగా పోలీసులు వారిపై ముందు హెచ్చరిక లేకుండా లాఠీ చార్జీతో పాటు కాల్పులు జరిపారని వివరించారు. ఆ కాల్పులలో ఒక ఫారెస్టు గార్డుతో పాటు పలువురు ఉద్యమకారులు మృతి చెందగా అప్పటికే లక్ష్మణ నాయక్‌ పై నిఘా పెట్టిన ఆంగ్ల పాలకులు ఫారెస్టు గార్డును లక్ష్మణ నాయక్‌ అతడి అనుచరులే హత్య చేశారని కేసు పెట్టి అరెస్టు చేశారని తెలిపారు. ఆ కేసులో లక్ష్మణ నాయక్‌ తో పాటు 50 మందిని అరెస్టు చేసారని వివరించారు. కోర్టు లక్ష్మణ నాయక్‌కు ఉరిశిక్ష విధించి బరంపురం జైలులో ఉరితీశారని గుర్తు చేశారు. స్వర్గీయ నాయక్‌ వ్యక్తి కాదని ఆయన మహాశక్తి అన్నారు. కార్యక్రమంలొ పూజ్య పూజ సంసద్‌ అద్యక్షులు ఇంజనీర్‌ కేదారనాత్‌ బెహర, బైరాగి సాహు లక్ష్మణ నాయక్‌ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం ఉత్కళ సమ్మిళినీ జయపురం శాఖ నేతలు బినోద్‌ మహాపాత్రో, జిల్లా అధ్యక్షుడు మదన మోహణ నాయిక్‌, రాజేంధ్ర గౌఢ, కార్యదర్శి నవీణ మదల, కృష్ణ చంద్ర హొత తదితరులు పాల్గొన్నారు.

రాయగడలో..

రాయగడ: ఒడిశా వరపుత్రుడు, ఆదివాసీల ఆశాదీపం సహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక రైతుల కాలనీ సమీపంలొ గల లక్ష్మణ్‌ నాయక్‌ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ జెన్న, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్‌ ప్రధాన్‌, బొమ్మాళి కాంతారావు, విద్యావేత్త డాక్టర్‌ దుస్మంత్‌ కుమార్‌ మహంతి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించి లక్ష్మణ్‌ నాయక్‌ సేవలను కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement