● వివిధ అంశాలపై చర్చ
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ పీజీ చరిత్ర విభాగం నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్ ఆదివారంతో ముగిసింది. ఒడిశా ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు వివిధ కళారూపాల వికాసం, రూపం, వాటి ప్రభావాలపై విశ్లేషించటం, ఒడిశా కళా ఆర్కిటెక్చర్‌పై మధ్య భారత్, దక్షిణ భారత్, పశ్చిమ బెంగాల్, గ్రీకు ప్రభావాలు, వాటి పరస్పర ప్రభావాలపై సెమినార్‌లో వక్తలు చర్చించారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, సంరక్షణ సమస్యల సవాళ్లపై అవగాహన కల్పించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ప్రధానంగా శిలా కళ, ప్రాచీన చారిత్రిక కళ, టెర్రకోట్, బౌద్ధ కళా (రతనగిరి, ఉదయగిరి, లలితగిరి)జైన కళ (ఖండగిరి, ఉదయగిరి) కళింగ శైలిదేవాలయాలు, శిల్ప కళ, పటచిత్ర, ప్రతిమ శాస్త్రం, హస్త కళలు, ఇస్లామిక్, వలస పాలన కాలపు కళలు, ఆదివాసీ కళల (సౌర, కోంధ్, బోండా)పై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేకంగా కోణార్క్ సూర్య, జగన్నాథ దేవాలయాలు.. ప్రాచీన ఆలయ నిర్మాణాలతోపాటు కళింగ శైలి దేవాలయాల రేఖ, పీడ, ఖఖరా రూపాలు, ఆదివాసీ కళల సరలత, ప్రముఖంగా ప్రస్తావించారు. జయపురం మహారాజు 1947లో కళాశాలను స్థాపించగా 2023లో ప్రభుత్వం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసిన విషయాన్ని సెమినార్‌లో ప్రస్తావించారు. విశ్వవిద్యాలయంలో చరిత్ర విద్యార్థులను పురాతన వారసత్వ పరిశోధన, సంరక్షణల వైపు ప్రోత్సహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సెమినార్‌లో ముఖ్యఅతిథిగా డాక్టర్ సునీల్ కుమార్ పట్నాయక్ పాల్గొనగా.. వక్తలుగా కిస్ విశ్వవిద్యాలయ డాక్టర్ రత్నాకర్ మహాపాత్రో, జేఎంయూ సంబల్‌పూర్ నుంచి సంతోష్ కుమార్ మల్లిక్, జయపురం విక్రమదేవ్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, గుణుపూర్ కళాశాల నుంచి డాక్టర్ సత్యవాన్ గరడ, న్యూఢిల్లీ పురావస్తు నిపుణులు డాక్టర్ ఆశిష్ రంజన్ సాహు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి విక్రమదేవ్ విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర పాల్గొని సెమినార్‌లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. యూనివర్సిటీ చరిత్ర విభాగాధిపతి డాక్టర్ శృష కుమార్ సాషాహు ధన్యవాదాలు తెలిజేశారు.


