భువనేశ్వర్: పవిత్ర అశోకాష్టమి సందర్భంగా గురువారం ఏకామ్ర క్షేత్రవాసుడు లింగరాజ స్వామి రుకుణ రథ యాత్రకు అంతరాయం ఏర్పడింది. నగరంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం ప్రభావంతో కాలవైశాఖి తాండవంతో ఈ భారీ రథ యాత్ర అర్ధంతరంగా నిలిచి పోయింది. కాల వైశాఖి తాండవంతో కురిసిన భారీ వర్షం మధ్య లింగ రాజు మహా ప్రభువు రుకుణ రథం ముందుకు సాగలేక పోయింది. గమ్యం చేరడంలో అంతరాయం తలెత్తింది. స్థానిక బొఢెయ్ బొంకొ కూడలి సమీపంలో లింగరాజ స్వామి రథం ఆగిపోయింది. కాల వైశాఖి ప్రభావంతో శక్తివంతమైన గాలులు, భారీ వర్షం పతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కొంత వరకు సాగిన యాత్రలో భక్తులు గొప్ప ఉత్సాహం, భక్తిశ్రద్ధలతో పవిత్ర రథాన్ని లాగడం కొనసాగించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 2.30 గంటల ప్రాంతంలో లాగడం తిరిగి ప్రారంభమవుతుంది.
సేవాయత్‌కు గాయాలు
యాత్ర కోసం రుకుణ రథం సిద్ధం చేస్తుండగా ప్రమాదవశాతు సేవాయత్ రథం పైనుంచి జారడంతో గాయపడ్డాడు. తక్షణమే స్థానిక క్యాపిటలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సేవాయత్ కాలు విరగడంతో ముఖం, తలకు మోస్తరు గాయాలు అయినట్లు ప్రకటించి చికిత్స కొనసాగిస్తున్నారు.


