భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో శుక్రవారం పవిత్రమైన అశోకాష్టమి క్రతువు వైభవంగా నిర్వహించారు. ప్రాతః ధూపం పూర్తయిన తర్వాత శ్రీ మందిరం ఉత్తర ద్వారం వద్ద కొలువై ఉన్న ఈశానేశ్వర మహాదేవునికి శ్రీ లోకనాథ ఆలయానికి పల్లకీ ఊరేగింపుతో అత్యంత వైభవంగా తీసుకువెళ్లారు. ఆ ప్రాంగణంలో వివిధ క్రతువులు నిర్వహించి శ్రీ జగన్నాథ వల్లభ మఠానికి తరలించారు. ఈ ప్రాంగణంలో పూజాదులు, నైవేద్య సమర్పణ ముగియడంతో మహా దేవుని మారు యాత్ర (బహుడా) కార్యక్రమాన్ని నిర్వహించారు.
5 గంటలు దర్శనం నిలిపివేత
పవిత్ర శ్రీ రామ నవమి సందర్భంగా పూరీ ఆలయంలో శ్రీరామ జన్మ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శుక్ర వారం భక్తులకు రత్న వేదికపై మూల విరాటుల సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేస్తారు. మధ్యాహ్నం ధూప సమర్పణ తర్వాత సర్వ దర్శనానికి అనుమతించరు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం మూసివేయబడుతుందని దేవస్థానం అధికార వర్గాలు తెలిపాయి.


