జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి అసన గ్రామ పంచాయతీ ఘివురిగుడలో అనాదిగా వస్తున్న సంప్రదాయ ఘట జాతర బుధవారం ముగిసింది. ఈ ఘట జాతరలో జయపురం మహారాజు విశ్వంభర దేవ్ చంద్ర చూడ్ పాల్గొన్నారు. ఆయనకు తన స్వతంత్ర సేవకులు మహారాజుల సంప్రదాయం ప్రకారం చథ్రం(గొడుగు) పట్టి వింజామరలతో విసురుతూ స్వాగతం పలికారు. రాజును గ్రామ దేవత పీఠం నుంచి ఒక స్వతంత్ర సింహాసనంపై భుజాలపై మోసుకుంటూ బొండాఘాట్ వరకు తోడ్కొని వెళ్లారు. అక్కడ దేవికి పూజలు నిర్వహించి ఆయనను గ్రామం లోనికి తీసుకు వచ్చారు. అక్కడ గ్రామ ప్రజలంతా చేరి రాజ దర్శనం చేసుకున్నారు. రాజుల కాలంలో ఘట జాతర ఉత్సవాల్లో గ్రామ పెద్దలు జయపురం వెళ్లి మహారాజుల ఆశీశులు పొంది తరువాత జాతర జరిపేవారని, అయితే నేడు రాజే స్వయంగా రావటం తమకెంతో ఆనందంగా ఉందని ప్రజలు వెల్లడించారు. ఘివురిగుడ ఘట జాతరకు రాజు తో పాటు రాజ కుటుంబ పూజారి పురుషోత్తమ నందో,రాజు పెర్సనల్ కార్యదర్శి కిశాన్ రథోడ్, రాజు కుటుంబ సేవకులు నరశింగ నాయుడు, భాగ్ధేరి ముఠా ప్రతినిధి తులా చంధ్ర సాహు ఘఠజాత్ర పూజారి సీతారాం కటియ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో అమ్మవారి ఘఠజాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు.


