నార్కోటిక్స్‌ భవన నిర్మాణానికి స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నార్కోటిక్స్‌ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

Mar 15 2026 1:01 AM | Updated on Mar 15 2026 1:01 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నార్కోటిక్స్‌, మత్తుమందుల నిర్మూలన లక్ష్యంగా జిల్లాలో వివిధ దాడులలో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నిల్వ చేసేందుకు నూతన భవన నిర్మించేందుకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, మొదటి ఎ.డి.జె. కోర్టు న్యాయమూర్తి పి.భాస్కరరావు శనివారం స్థల పరిశీలన చేశారు. సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నాలుగు సెంట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టేందుకు కొలతలు వేయించి సంబంధిత అధికారులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్లు చంద్రశేఖరరావు, శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ డీఈఈ ధనుంజయ, తహసీల్దార్‌ ఎస్‌.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.

టెన్త్‌ ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు

శ్రీకాకుళం: జిల్లాలో పదో తరగతి చదువుతూ పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, కేజీబీవీ విద్యార్థులకు వి.కె.ఫ్యామిలీ నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు జిల్లా సమన్వయకర్త పూజారి హరిప్రసన్న శనివారం తెలిపారు. మొదటి 10 మంది విద్యార్థులకు రూ.80,000, జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి రూ.20,000, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.15000, మూడో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.10,000 చొప్పున వసుదైక కుటుంబం యూనివర్సల్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌ ద్వారా అందజేయనున్నట్లు హరిప్రసన్న, వి.కె.ఫ్యామిలీ జిల్లా మెంటార్స్‌ గుణశేఖర్‌, సాయికుమార్‌, పాపారావు, సునీత, సత్యవతి తదితరులు పేర్కొన్నారు.

హోటళ్లలో డొమెస్టిక్‌ సిలిండర్ల పట్టివేత

రణస్థలం: లావేరు మండలం బుడుమూరులో హైవే పక్కన ఉన్న రెండు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న 14 డొమెస్టిక్‌(గృహావసర) గ్యాస్‌ సిలిండర్లను విజిలెన్సు అధికారులు శనివారం పట్టుకున్నారు. ఐదుగురు నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్‌ సీఐ డి.డి.వి.సతీష్‌ కుమార్‌, ఎస్సై బి.రామారావు, సివిల్‌ సప్లయ్‌ ఆర్‌ఐ శ్రీను ఉన్నారు.

మాజీ డీజీపీ దొర మృతికి ధర్మాన సంతాపం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : మాజీ డీజీపీ హెచ్‌.జె.దొర మృతి బాధాకరమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మించి ఉద్యోగ రీత్యా అనితర సాధ్యమైన ఎత్తుకి ఎదిగిన గొప్ప వ్యక్తి దొర అని కొనియాడారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిస్వార్థంగా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

వజ్రపుకొత్తూరు రూరల్‌: గంగరాంపేట సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని శనివారం ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో స్థానికులు ఊపీరిపీల్చుకున్నారు. స్థానికులు, విద్యుత్‌ శాఖాధికారులు తెలిపిన వివరాలు మేరకు.. పల్లిసారధి గ్రామం నుంచి పలాస వైపు వస్తున్న కారు గంగారంపేట వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న 11 కె.వి. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్‌ స్తంభం విరిగి నేలకు ఒరిగిపోగా.. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడికక్కడే కారును వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న విద్యుత్‌ శాఖాధికారులు వెంటనే కరెంట్‌ సరఫరా నిలుపుదల చేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకొని కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదానికి గురైన కారు ఒడిశా రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టి నష్టపరిహారం వసూలు చేస్తామని విద్యుత్‌ శాఖ ఏఈ వెంకటరమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement