కొరాపుట్: రిజర్వాయర్‌లో మునిగి ముగ్గురు నవోదయ విద్యార్థులు మృతి చెందిన విషాదకర ఘటన శనివారం సాయంత్రం జరిగింది. కొరాపుట్ జిల్లా కేంద్రం సమీపంలోలోని మచ్ర గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్థులు కొరాపుట్‌లో మెట్రిక్ పరీక్షలు రాసి తిరిగి వచ్చారు. చివరి పరీక్ష కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకొని వెళ్లడానికి స్కూల్‌కి వచ్చారు. అందులో ఏడుగురు విద్యార్థుల తల్లిదండ్రలు రాక ఆలస్యమైంది. దీంతో ఆ ఏడుగురు విద్యార్థులు సమీప కొలాబ్ రిజర్వాయర్‌లో ఈత ఈదడానికి వెళ్లారు. నీటి వైపు వెళ్తున్న విద్యార్థులను సమీప పశువుల కాపర్లు నీటి లోతు ఎక్కువ ఉందని నీటిలో దిగ వద్దని వారించారు. అయినప్పటికీ ఆ విద్యార్థులు తమకు ఈత వచ్చునని చెబుతూ రిజర్వాయర్‌లో దిగారు. అందులో ముగ్గురు మునిగి పోయారు. ఇది చూసిన మిగతా విద్యార్థులు భయంతో స్కూల్ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. వెంటనే స్కూల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి లక్ష్మీపూర్ సమితి బిరిగుడ గ్రామానికి చెందిన స్వస్ధిక్ హల్వ(15), లమ్తాపుట్ సమితికి చెందిన ఓం ప్రకాష్ (15), లింగరాజ్ (15) మృతదేహాలను వెలికి తీశారు. ఘటన తెలిసి బాధిత కుటుంబాలు స్కూల్‌పై దాడికి ప్రయత్నం చేశారు. వారిని ప్రజా ప్రతినిధులు వారించారు. కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ ఈ ఘటన పై దర్యాప్తుకి ఆదేశించారు. ఆదివారం జిల్లాస్థాయి ఉన్నతాధికారులు సంఘటన స్ధలం కి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.


