కల్యాణ మండపం అభివృద్ధికి విరాళం
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కల్యాణ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మండపం అభివృద్ధికి ఉత్కళాంధ్ర బ్రాహ్మణ సేవా సమాజం రూ.50 వేల విరాళాన్ని గురువారం అందజేసింది. సమాజం అధ్యక్షుడు రేజేటి శ్రీనివాస్ శర్మ, కార్యదర్శి కొల్లూరు సూర్యనారాయణ శర్మ, కోశాధికారి తెన్నేటి సీతారామ శాస్త్రి ఆలయ ప్రాంగణంలో ధర్మకర్త కొత్తకోట చంద్రమౌళి కుముంధాన్‌కు విరాళాన్ని అందించారు. కార్యక్రమంలో వేంకటేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు పాల్గొన్నారు.
పురుటిగూడలో ఏనుగుల స్వైర విహారం
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ ఖండవ పంచాయతీ పురుటిగూడ గ్రామంలో గత రెండు నెలలుగా నాలుగు అటవీ గున్న ఏనుగులు సంచరిస్తూ ప్రస్తుత పంట టమోటా, అరటి, కోబ్బరి తోటలు, మొక్కజొన్న పంటలు నాశనం చేస్తున్నాయని రైతు, బీజేపీ నాయకులు రొక్కం సతీష్ ఆరోపిస్తున్నారు. వంశధార పరివాహక ప్రాంతం అయిన పురుటిగూడలో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ కరెంటు కోతలు విధిస్తున్నారు. దీనిపై జిల్లా అటవీ శాఖ అధికారులను సంప్రదించగా అటవీ ఏనుగులు సంరక్షణే మా బాధ్యత అని అందువుల్ల వాటికి ఎలాంటి హానీ జరుగకుండా కరెంటు కోతలు విధిస్తున్నామని అంటున్నారు. ఒక్కోసారి రోజంతా కరెంటు కోత విధిస్తుండటంతో పదోతరగతి విద్యార్థులు చదువుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, అరటి, టమోటా పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయని పురుటిగూడ ప్రజలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో నాసిరకం పాల విక్రయం
భువనేశ్వర్: రాష్ట్రంలో నాసిరకం పాలు అమ్ముడవుతున్నాయని మత్స్య, పశు వనరుల మంత్రి గోకులానంద్ మల్లిక్ సభలో ప్రకటించారు. గత ఏడాది 88 ప్రైవేట్ కంపెనీల పాలను తనిఖీ చేశారు. వాటిలో 8 నమూనాలు నాసిరకం నాణ్యతతో ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఓంఫెడ్ కాకుండా 22 కంపెనీలు పాల ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్నాయి. వీరిలో 10 మంది ఒడిశాకు చెందినవారు కాగా 12 మంది రాష్ట్రం వెలుపలి వారు అని మత్స్య, పశు వనరుల మంత్రి తెలిపారు. సభలో మంత్రి ఈ సమాచారం వెల్లడించడంతో మార్కెట్‌లో లభించే పాల గురించి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నకిలీ పాలకు సంబంధించి గుర్తింపు ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. బీజేపీ ఎమ్మెల్యే టంకధర్ త్రిపాఠి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా విభాగం మంత్రి ఈ సమాధానం సభలో ప్రవేశ పెట్టారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పాలు, పాల ఉత్పత్తుల మొత్తం 88 విక్రయ సంస్థల నమూనాలను భువనేశ్వర్‌లోని రాష్ట్ర ఆహార పరీక్షా ప్రయోగశాలలో పరీక్షించామని పశు వనరుల అభివృద్ధి మంత్రి గోకులానంద మల్లిక్ తెలిపారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనల
ఆహ్వానం
రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు దాఖలయ్యే అభ్యర్థనలు, ప్రతిపాదనలను పరిశీలిస్తామని మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు 31 కొత్త జిల్లాల ఏర్పాటుకు పలు ప్రాంతాల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. తగిన సమయంలో ప్రభుత్వం ఈ అభ్యర్థనలను పరిశీలిస్తుందని రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. రాష్ట్రంలో 35,452 ఇళ్లు లేని కుటుంబాలను గుర్తించామని, అందులో 28,511 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని రెవెన్యూ మంత్రి బిజూ జనతా దళ్ (బీజేడీ) ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ కుమార్ సాహు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. నవరంగ్‌పూర్ జిల్లాలోని నవరంగ్‌పూర్ తహసీల్‌లో అత్యధికంగా 1,029 కుటుంబాలను గుర్తించగా బర్‌గఢ్ జిల్లాలోని అట్టబిరా తహసీల్‌లో గరిష్టంగా 630 పట్టాలు పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు.
కల్యాణ మండపం అభివృద్ధికి విరాళం


