ప్రముఖ గాయని గీతా పట్నాయక్ కన్నుమూత
భువనేశ్వర్: ప్రముఖ నేపథ్య గాయని గీతా పట్నాయక్ (71) కటక్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆదివారం మరణించారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆమె ఆస్పత్రిలో చేరారు. సోమవారం సతిచురా శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతా పట్నాయక్ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల జ్యూరీ సభ్యురాలు. ఆమె మొదటి పాట ‘జగబంధు పొరి జొణె సామంత’. ఆమె 15 ఏళ్ల వయసులో ‘ఒదినొ మేఘొ’లో తొలి సారిగా పాడారు. హిందీ, గుజరాతీ, రాజస్థానీ, మరాఠీ భాషలలో నేపథ్య గానం అందించారు. బిశ్వొ దెఖొ మధుమాయారే జీబొనొ పాటకు ఆమె రాష్ట్ర అవార్డులను అందుకుంది. అక్షయ సాహిత్యం, అక్షయ సంగీత సత్కారం పొందారు.
యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు
పలాస: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని ఎంఐజీ లే అవుట్ పక్కన పెంటిభద్ర గిరిజన గ్రామం సర్వే నంబర్ 410లోని మెండులో ప్రొక్లెయినర్‌తో గ్రావెల్ తవ్వేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా ఈ కంకరను ట్రిప్పర్లతో తరలిస్తున్నారు. ఇటీవల పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పలాస మండలంలో ఎక్కడ కూడా గ్రావెల్ తవ్వకాలకు అనుమతి లేదని మైనింగ్ అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కూడా తీవ్రస్థాయిలో స్పందించి అక్రమ తవ్వకాలు జరిగితే తన వరకు తీసుకు రావద్దని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అయినప్పటికీ అక్రమ తవ్వకాలు జరగుతుండడం విశేషం. ఈ విషయంపై పలాస తహసీల్దార్ టి.కల్యాణ చక్రవర్తిని వివరణ కోరగా ఎవరికీ అనుమతులు లేవని, తాను అక్కడికి వెళ్లి పరిశీలిస్తానని తెలియజేశారు.
ప్రముఖ గాయని గీతా పట్నాయక్ కన్నుమూత


