కోర్టు ముందు హాజరైన మావో నేత ఆజాద్
రాయగడ: మావో నేత ఆజాద్ అలియాస్ దున్న కేశవరావును శనివారం జిల్లాలోని బిసంకటక్ ఫస్ట్‌క్లాస్ జ్యూడిషియల్ డివిజనల్ కోర్టులో హాజరుపరిచారు. జిల్లాలోని చంద్రపూర్‌లో మావోయిస్టు నాయకుడు ఆజాద్, సబ్యసాచి, నిఖిల్‌తో పాటు మరో 200 మంది సాయుధులైన మావోయిస్టులు చంద్రపూర్ టెలిఫొన్ ఎక్స్చేంజీ, బీఆర్‌సీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు. ఈ మేరకు చంద్రపూర్‌లో మే 20 వ తేదీ 2010లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చంద్రపూర్ ఐఐసీగా విధులు నిర్వహించే కై లాస్ చంద్ర బురుడా మావోలపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కొంతమందిని పర్లాకిమిడిలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయగా, మావో నేత ఆజాద్‌ను శనివారం బిసంకటక్ కోర్టులో హాజరుపరిచారు.
వృద్ధురాలికి గాయాలు
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధి సికరపాయి పంచాయతీలోని బిరిడి గ్రామానికి చెందిన ఆదివాసీ వృద్ధురాలు గాయాలకు గురయ్యింది. శుక్రవారం రాత్రి మంచంపై పడుకున్న ఆమె మంచం కింద వెచ్చదనం కోసం అగ్గితో కుంపటిని పెట్టుకుని నిద్రించింది. ఈ క్రమంలో అర్ధరాత్రి ఆమె మంచానికి నిప్పు అంటుకుని వీపు భాగం పూర్తిగా కాలిపోయి గాయాలు పాలైంది. దీంతో అరచి కేకలు వేయడంతో కుటుంబీకులు ఆమెను మంటల నుంచి రక్షించి వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.
వరిగడ్డి కుప్పలు దగ్ధం
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితి లక్ష్మీపూర్ మాలిగుడ గ్రామంలోని ఒక కల్లంలో కుప్పలుగా వేసిన గడ్డి వాములు అకస్మాత్తుగా కాలి బూడిదయ్యాయి. 12 ఎకరాల్లో పండిన ధాన్యం నూర్పులు జరిగిన తర్వాత గడ్డిని రైతులు కల్లంలో కుప్పలు వేశారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఆ గ్రామ రైతులు జగబందు మాలి, తైల మాలి, హరిహర మాలి, నరేంద్ర మాలి, బలభద్ర మాలి మొదలగు వారు కల్లంలో కుప్పలు వేసిన గడ్డి వాములు కాలిపోయాయి. కల్లానికి సమీపంలోని కాయగూరల మడుల్లో ఉంటున్న కొంతమంది మంటలు వేయగా, బాగా గాలి వీచి అగ్గి రవ్వలు గడ్డి వాములపై పడి అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక విభాగం అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.80 వేల నష్టం ఉంటుందని అంచనా వేశారు.
ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు
రాయగడ: పట్టణంలోని కేఎస్‌కో లోపల ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో శనివారం మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడి వారు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటపాటుగా శ్రమించి మంటలను అదుపుచేయగలిగారు. ఈ ఘటనలో ఎటువంటి ధన, ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి తీసుకున్నారు.
10 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్ల స్వాధీనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో అక్రమ మద్యం అమ్మకాలపై కలిమెల పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఐఐసీ ప్రభుదత్త విశ్వాల్ నేతృత్వంలో పోలీసులు పనిమేట్లా గ్రామంలో దాడులు చేసి ఒకరిని అరెస్టు చేసి పది విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి ఎం.పి.వి.61 గ్రామానికి చెందిన రంజిత్ రాయ్‌గా గుర్తించారు. శుక్రవారం రంజిత్‌పై కేసు నమోదు చేశారు.
కోర్టు ముందు హాజరైన మావో నేత ఆజాద్
కోర్టు ముందు హాజరైన మావో నేత ఆజాద్
కోర్టు ముందు హాజరైన మావో నేత ఆజాద్
కోర్టు ముందు హాజరైన మావో నేత ఆజాద్


