ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
జయపురం: జయపురం మున్సిపాలిటీలోని నాలుగో నంబర్ వార్డు లింగరాజ్‌నగర్ ఖెందుగుడలో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణల తొలగింపునకు అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. అయితే స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకుంది. ఎంతో కాలంగా నోటీసులు ఇచ్చినా ఆక్రమణదారులు ఇళ్లను తొలగించక పోవటంతో అధికారులు తొలగింపునకు సిద్ధమయ్యారు. మున్సిపల్ అధికారులు, జయపురం అదనపు తహసీల్దార్ చిత్తరంజన్ పట్నాయక్, తహసీల్ కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ అదనపు కార్యనిర్వాహక అధికారిణి పూజా రౌత్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్, పోలీసులతో ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టారు. అయితే ఆక్రమణల తొలగింపుపై అధికారులు ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని ఆక్రమణదారులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కూలీలకు చెందిన ఇళ్లను కూల్చి వేస్తూ పెద్దల దుకాణాలు, భవనాలు ఎందుకు విడిచి పెడుతున్నారని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ధనికులు, పేదలు అనే బేధం లేకుండా చర్యలు తీసుకోవాలని, మరోసారి సర్వే నిర్వహించిన తరువాతనే తొలగింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబాల భద్రతపై వారు భయం వ్యక్తం చేస్తూ రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై అదనపు కార్యనిర్వాహక అధికారిని ప్రశ్నించగా జయపురం సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగింపు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం ప్రజలు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యను వివరించారు. ఈ నేపథ్యంలో లింగరాజ్ నగర్ ఖెందుగుడ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తాత్కాలికంగా పది రోజులు నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత


