నాడు కొడుకు.. నేడు తండ్రి..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒక ఇంటిపై విధి ఎంత క్రూరంగా విరుచుకుపడిందన్నది సారిపల్లి గ్రామం కన్నీళ్లతో చెబుతోంది. ఎనిమిది నెలల కిందట కొడుకును రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఆ తండ్రి... ఇంకా ఆ బాధ నుంచి కోలుకోకముందే అదే తరహా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన నడిపేన శ్రీనివాసరావు(58) వృత్తి రీత్యా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బస్సు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరీష్ భోగాపురం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా డ్రైవర్ వృత్తి చేస్తున్నాడు. చిన్న కుమారుడు పురుషోత్తం కూడా తండ్రివలే డ్రైవర్ వృత్తి చేస్తూ భక్తులను సుదూర ప్రాంతాల్లో తీర్థ యాత్రలకు తీసుకువెళ్లేవాడు. సుమారు ఎనిమిది నెలల కిందట భక్తులను కాశీ యాత్రకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అలాంటి ప్రమాదంలోనే తండ్రి కూడా కన్నుమూయడం ఆ కుటుంబాన్ని కలిచివేస్తోంది.


