వైద్య రంగంలో హైటెక్ మరో ముందడుగు
భువనేశ్వర్: వైద్య రంగంలో హైటెక్ గ్రూప్ మరో ముందడుగు వేసింది. ఆరోగ్యం, చికిత్స, వైద్య రంగాల్లో సమయానుకూల విధానాల అనుసరణ దృక్పథంతో ఒడిశా మెడికల్ డివైసెస్ ఎక్స్‌పో 2026 నిర్వహణకు సారథ్యం వహిస్తుంది. ఈ నెల 13 నుండి 15 వరకు బారముండా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ ప్రదర్శన జరుగుతుంది. వైద్య రంగంలో విశేష అధునాతన చికిత్స విధానాల్ని విస్తృతపరచాలని హైటెక్ సంకల్పించింది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వైద్య, చికిత్స రంగాల్లో పలు అధునాతన సాంకేతిక, వైజ్ఞానిక పరికరాల ప్రాధాన్యత పుంజుకుంటుంది. ఈ పరిస్థితిపై రాష్ట్రంలో వైద్య వర్గాలకు పూర్తి అవగాహన కల్పించి ప్రజలకు అధునాతన శైలిలో నాణ్యమైన చికిత్స, వైద్య సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ఈ ఏడాది ఒడిశా మెడికల్ డివైసెస్ ఎక్స్‌పో 2026 నిర్వహణ బాధ్యతల్ని స్వీకరించినట్లు హైటెక్ గ్రూప్ డైరెక్టర్ అనిల్ కుమార్ పాణిగ్రాహి తెలిపారు. దేశ వ్యాప్తంగా పేరొందిన వైద్య పరికరాల ఉత్పాదనలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకుంటాయి. వాటి వినియోగం, చికిత్స, వైద్య రంగాల్లో ప్రయోగం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు పెద్ద సంఖ్యలో అనుభవజ్ఞులైన వైద్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటారని ఆయన వివరించారు. 50 పైబడి ప్రముఖ వైద్య పరికరాల ఉత్పాదన సంస్థలు, 1500 మంది వైద్య ప్రముఖులు, వివిధ వర్గాల పారా మెడికల్ ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమం పురస్కరించుకుని స్థానిక హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆడిటోరియంలో బుధ వారం ఒడిశా వైద్య పరికరాల ప్రదర్శన – 2026 పోస్టరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హైటెక్ గ్రూప్ డైరెక్టర్ అనిల్ కుమార్ పాణిగ్రాహితో ఒడిశా వైద్య సేవల సంఘం (ఒంసా) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషోర్ చంద్ర మిశ్రా, శ్రీకాంత్ కుమార్ సామల్ హాజరు అయ్యారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో అధునాతన సాంకేతిక వైద్య పరికరాలు గణనీయమైన మార్పును తీసుకువస్తాయని వీరంతా వివరించారు.


