ఆరోగ్యకర పర్యావరణం
అడవులతోనే..
భువనేశ్వర్: అడవులతోనే ఆరోగ్యకర వాతావరణం సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా పిలుపునిచ్చారు. భారత దేశంలో జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) సహాయ అటవీ ప్రాజెక్టుల 14వ జాతీయ వర్క్‌షాప్ ప్రారంభోత్సవం పురస్కరించుకుని బుధవారం మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమం 3 రోజులపాటు నిరవధికంగా కొనసాగుతుంది. అటవీ పర్యావరణ పరిరక్షణ, అటవీ ఉత్పాదనల ప్రోత్సాహం తదితర రంగాల్లో జాతీయ ప్రముఖులతో జపాన్ నుంచి నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
భావి అటవీ సన్నద్ధత శీర్షికతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వాతావరణ మార్పులు, డిజిటల్ పరివర్తన, అటవీ ఆర్థిక వనరుల సుస్థిరత దిశలో భావి కార్యాచరణ రూపకల్పన ఈ వర్క్‌షాపు ప్రధాన లక్ష్యంగా వక్తలు పేర్కొన్నారు. భారత దేశ అటవీ రంగంలో సాంకేతికత, స్థిరత్వం ఏకీకరణకు వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసేందుకు ప్రముఖులు అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని నిర్మాణాత్మక కార్యాచరణ ఖరారు చేస్తారు. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) రెండో విడత ఒడిశా ఫారెస్ట్రీ సెక్టార్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కార్యకలాపాలు త్వరలో పూర్తి కానున్నాయి. వర్ధమాన పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టు 3వ విడతని కొనసాగించాలని మంత్రి ప్రతిపాదించారు. ఈ చర్యతో భారత దేశంలో అత్యంత దుర్బల జనాభాను రక్షించడం సుసాధ్యం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
గిరిజన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో జైకా భాగస్వామ్యం కీలక పాత్ర పోషించిందని మంత్రి ప్రశంసించారు. 2వ విడత ఒడిశా ఫారెస్ట్రీ సెక్టార్ డెవలప్‌మెంట్ వచ్చే సంవత్సరం మార్చిలో పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో 3వ విడత అమలు చేసి కొనసాగించాలని మంత్రి కోరారు. సమృద్ధ ఒడిశా 2036 దార్శనికతకు ఈ కొనసాగింపు దోహదపడుతుందన్నారు. వికసిత్ భారత్ 2047లో సమృద్ధ ఒడిశా కీలక అంశంగా నిలుస్తుందన్నారు. ఈ ప్రతిపాదనపై అనుభవజ్ఞులైన అంతర్జాతీయ విధాన నిర్ణేతలు చర్చించాలని తెలిపారు.
వర్కుషాపు ప్రారంభోత్సవ సభలో జైకా భారత దేశ డెవలప్‌మెంట్ ఆపరేషనన్స్ చీఫ్ వినీత్ ఎస్.సరిన్ మరియు జైకా ఇండియా సీనియర్ ప్రతినిధి వాకమత్సు ఈజీ కీలక ప్రసంగాలు చేశారు. భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ కె. బి. సింగ్, ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ ఫోర్స్ ప్రముఖుడు డాక్టర్ కె. మురుగేషన్, అదనపు పీసీసీఎఫ్ (ప్రాజెక్ట్సు), ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రాజేష్ తదితర ప్రముఖులు వర్కుషాపు కార్యశైలి ప్రధాన అంశాలపై ప్రసంగించారు.
ఆరోగ్యకర పర్యావరణం
ఆరోగ్యకర పర్యావరణం


