నందన్‌కానన్‌ జూలో ఐదు మొసళ్లు మృతి | - | Sakshi
Sakshi News home page

నందన్‌కానన్‌ జూలో ఐదు మొసళ్లు మృతి

Feb 2 2026 8:18 AM | Updated on Feb 2 2026 8:18 AM

నందన్‌కానన్‌ జూలో ఐదు మొసళ్లు మృతి

నందన్‌కానన్‌ జూలో ఐదు మొసళ్లు మృతి

భువనేశ్వర్‌: నగరం శివారు బారంగ్‌ నందన్‌కానన్‌ జూలో మొసళ్ల మృతి ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది జనవరి 23 నుంచి 30 వరకు 8 రోజుల స్వల్ప వ్యవధిలో వరుసగా 5 మొసళ్లు మరణించినట్లు నందన్‌ కానన్‌ జూలాజికల్‌ పార్క్‌ అధికారులు తెలిపారు. మొసళ్ల మృత్యు సంఘటన వన్యప్రాణుల ప్రియులు, జూ అధికారులలో ఆందోళన కలిగిస్తుంది. మొసళ్ల వరుస మరణాలకు కచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. జూ పార్కు అధికారులు మరణించిన మొసళ్లకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ నివేదికల ఆధారంగా మరణానికి కచ్చితమైన కారణాన్ని వెటర్నరీ, ఫోరెన్సిక్‌ నిపుణులు వెల్లడిస్తారని జూ అధికారులు ఆశిస్తున్నారు. నందన్‌ కానన్‌ జూలో మిగిలిన మొసళ్ల ఆరోగ్యాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పార్క్‌ మొసళ్ల పరిరక్షణ, సంతాన ఉత్పత్తి, పెంపకం కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. మగ్గర్‌ మొసళ్లు (క్రోకోడైలస్‌ పలుస్ట్రిస్‌), ఘారియల్స్‌ వంటి జాతుల గణనీయమైన మొసలి సంతతి విస్తరణకు నందన్‌ కానన్‌ జూలాజికల్‌ పార్క్‌ పేరొందింది.

రౌతుపురంలో ఏసుక్రీస్తు వార్షిక సభలు

పర్లాకిమిడి: జిల్లాలో గుసాని బ్లాక్‌ ఘోర్ని పంచాయతీ రౌతుపురంలో ఎస్‌.బి.సి.ఎం.ఎస్‌ బెతానీ బంగళా (సెరంగో) ద్వారా జరిగిన ఏసుక్రీస్తు ఆరాధన సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి విచ్చేశారు. ఈ సభలో ఎమ్మెల్యేకు దిలీప్‌ శోబోరో, డికెన్‌ బిశోయిలు సత్కరించారు. ఈ సభకు మోహానా ఎమ్మెల్యే దాశరథి గోమంగో, జిల్లా పరిషత్తు మాజీ చైర్మన్‌ ఎరగాన రామచంద్రరావు, గుసాని సమితి చైర్మన్‌ ఎన్‌.వీర్రాజు, జెడ్పీటీసీ గుసాని ఎస్‌.బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

యువకుడు ఆత్మహత్యాయత్నం

టెక్కలి రూరల్‌ : స్థానిక తెంబూర్‌ రోడ్డులో రైల్వే ట్రాక్‌పై ఆదివారం ఉదయం ఓ యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం బందపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆదివారం టెక్కలి వచ్చి తాను ప్రేమించిన అమ్మాయికి ఫోన్‌ చేసి తనకు యాక్సిడెంట్‌ అయిందని, వెంటనే రావాలని ఫోన్‌ చెయ్యడంతో ఆ యువతి టెక్కలి వచ్చింది. అయితే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎందుకు అలా చెప్పావు.. ఏమీ కాలేదు కదా.. నేను తిరిగి వెళ్లిపోతానని చెప్పడంతో ఆ యువకుడు రైలు వస్తుండటం గమనించి ఇప్పుడు ప్రమాదం జరుగుతుంది చూడు అంటూ రైలు పట్టాలపై తలపెట్టాడు. ఇది గమనించి సమీప వసతిగృహ విద్యార్థులు ఆ యువకుడిని పట్టాలపై నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. దీంతో నౌపడ నుంచి గుణుపూర్‌ వైపు వెళ్లే రైలును కొంత సమయం నిలిపివేశారు. అనంతరం ఆ యువకుడిని పట్టాలపై నుంచి బయటకు తీసి స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్‌ ఇచ్చి వారి కుటుంబసభ్యులను రప్పించి వారికి అప్పగించారు. అయితే ఈ యువకుడు విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement