కొట్టేసేందుకు సిద్ధం!
నరసన్నపేట బోర్డు బంగ్లా స్థలం వద్ద మళ్లీ పనులు
అధికారులు కట్టిన గోడను తొలగించిన ఆక్రమణదారులు
శ్రీకాకుళానికి చెందిన ఓ టీడీపీ నేత జోక్యంపై అనుమానాలు
రహస్యంగా రాత్రివేళ మట్టి చదును పనులు
మా దృష్టికీ వచ్చింది..
నరసన్నపేట:
నరసన్నపేట పట్టణం నడిబొడ్డున బజారులో ప్రభుత్వానికి చెందిన బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. కోటి రూపాయలకు పైగా విలువైన ఈ స్థలం కొట్టేయడానికి అధికార పార్టీకి చెందిన జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉంటున్న ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధికారుల గతంలో కట్టిన గోడను తొలగించి గురువారం రాత్రి రెండు జేసీబీలతో బోర్డు బంగ్లా స్థలాన్ని చదును చేయించారు. ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టేందుకు సిమెంట్ ఇటుకలు సైతం సిద్ధం చేశారు. ఈ సమాచారం శుక్రవారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థలం కబ్జాకు గురి కావడం ఖాయమని స్థానికులు గుసగుసలాడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఆమదాలవలసకు చెంది న కొందరు వ్యక్తులు బొరిగివలస వారితో కలసి తమకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని, కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ స్థలం వద్దకు వచ్చి నానా హంగామా చేశారు. అయితే అధికారులు, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి సమర్థంగా అడ్డుకుని ఈ స్థలాన్ని కాపాడుకోగలిగారు. అప్పటి తహసీల్దార్ సింహాచలం, ఎంపీ డీఓ మధుసూదనరావులు స్పందించి ఇది ప్రభుత్వ స్థలంగా బోర్డులు పెట్టడం, స్థలం రోడ్డువైపున గోడ కట్టడం వంటివి చేయించారు. తాజాగా ఆమదాలవలసకు చెందిన వ్యక్తులు సదరు స్థలాన్ని శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకుడికి విక్రయించారని తెలుస్తోంది. వీరి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా సదరు నేత రాత్రిపూట వచ్చి పనులకు శ్రీకారం చుట్టారు. మంగళ, బుధవారాల్లో నరసన్నపేటకు వచ్చిన ఆయన స్థానికులతో మంతనాలు జరిపారని, టీడీపీ నాయకులు, అధికారులను సైతం కలిశారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే రాత్రి వచ్చి పనులు మట్టిని చదును చేయించారని సమాచారం.
ఈ స్థలం 40 ఏళ్ల క్రితం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. బ్రిటిష్ కాలంలో ఇక్కడ బోర్డు బంగ్లా పేరిట ఒక భవనం ఉండేది. ఇది జిల్లా పరిషత్‌కు చెందినది. సంబంధిత పత్రాలు సైతం ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఎవరో ఒకరు తమకు హక్కులు ఉన్నా యంటూ రావడం.. అధికారులు అడ్డుకోవడం జరుగుతోంది. గొట్టిపల్లి రెవెన్యూలో పరిధిలోని సర్వే నంబరు 219 బీ వన్‌లో ఉన్న ఈ 38 సెంట్లు (బోర్డు బంగ్లా) స్థలం ప్రభుత్వానిదేనని తహసీల్దార్, ఎంపీడీఓలు గతంలోనే స్పష్టం చేశారు. తప్పుడు పత్రా లు చూపించి తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, లింకు డాక్యుమెంట్లు సృష్టించుకోవడం చెల్లదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ స్థలంలో మట్టి చదును చేయడం.. దీని వెనుక కేంద్ర మంత్రి సన్నిహితుడు ఉన్నారనే ఆరోపణలు రావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే పట్టణం, పరిసర గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న అధికార పార్టీ కార్యకర్తలు ఇప్పుడు దీనిపై కన్నేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై నరసన్నపేట పంచాయతీ ఈఓ ద్రాక్షాయిని వద్ద ప్రస్తావించగా సమాచారాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.
బోర్డు బంగ్లా స్థలంలో రాత్రి ఎవరో వచ్చి జేసీబీల సహాయంతో మట్టి చదును చేశారని మా దృష్టికి వచ్చింది. ఎవరో తెలియకుండా రాత్రి సమయంలో వచ్చి పనులు చేయడం సరికాదు. మీ స్థలం అనుకున్నప్పుడు రాత్రి వచ్చి పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. పగలే చేయవచ్చుకదా? దీనిపై దృష్టి పెట్టాం. ఎవరు పనులు చేశారనేదానిపై ఆరా తీస్తున్నాం.
– వెంకటేశ్వర ప్రసాద్, నరసన్నపేట ఎంపీడీఓ
కొట్టేసేందుకు సిద్ధం!
కొట్టేసేందుకు సిద్ధం!


