చిన్నతనంలోనే పెద్ద కష్టం
క్యాన్సర్‌తో పోరాడుతున్న
ఏడేళ్ల బాలుడు జ్ఞానేశ్వరరావు
తల్లి మృతి..కూలి పనులు చేస్తున్న తండ్రి
వైద్యం కోసం ఇంటిని అమ్మేసిన వైనం
దాతల సాయం కోసం ఎదురుచూపు
ఎచ్చెర్ల/జి.సిగడాం :
నిరుపేద కుటుంబాలను ప్రాణాంతక వ్యాధులు వెంటాడుతున్నాయి. చిన్నతనంలోనే వారి బతుకులను చిదిమేస్తున్నాయి. ఏమీ చేయ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద తల్లిదండ్రులు పిల్లల బాధలను చూడలేక అల్లాడిపోతున్నారు. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామానికి చెందిన కానూరి భద్రరావుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నకుమారుడు జ్ఞానేశ్వరరావు(7) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. మూడేళ్ల వయస్సులోనే తల్లిని కోల్పోయాడు. దీంతో తండ్రి కూలి పనులు చేసుకుంటూ జీవనం నెట్టుకోస్తున్నాడు. కొడుకు దీనావస్థను చూసిన తండ్రి తన వద్ద ఉన్నదంతా వైద్యానికి ఖర్చు చేశాడు. చివరికి ఇంటిని సైతం అమ్మేసి వైద్యం చేయించా డు. ఇప్పుడు గ్రామంలో ఓ స్కూల్లో కుటుంబంతో తలదాచుకుంటున్నాడు. వైద్యుల సూచన మేరకు జ్ఞానేశ్వరరావును అగనంపూడి క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్పించారు. బతకడానికే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి వైద్యం ఖర్చులు భరించ డం మరింత భారంగా మారింది.
జ్ఞానేశ్వరరావు వైద్యం కోసం సాయం చేయాలనుకుంటే 8978820683
నంబర్‌ను సంప్రదించవచ్చు.


