విద్యార్థులు అంకితభావం అలవర్చుకోవాలి
జయపురం: విద్యార్థులు అంకితభావం అలవర్చుకోవాలని ప్రముఖ ఒడియా దినపత్రిక ప్రమయ జయపురం ఎడిషన్ చీఫ్ బ్యూరో ప్రకాశ్ చంద్రదాస్ అన్నారు. స్థానిక నెహ్రూ నగర్‌లో తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహిస్తున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో క్రీడల బహుమతుల ప్రధాన ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధృడ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన విద్యతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరన్నారు. వైఫల్యాలకు నిరాశ చెందకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఉత్సవానికి అధ్యక్షత వహించిన తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు బిరేష్ పట్నాయిక్ మాట్లాడుతూ.. పాఠశాలలో అధ్యాపక సిబ్బంది ఉత్తమంగా పనిచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం వివిధ క్రీడల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సమితి సభ్యులు ఎ.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, ఎస్.ఈశ్వరరావు, పి.శివ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు అంకితభావం అలవర్చుకోవాలి


