విస్తృతమైన అవకాశాలు
● గవర్నర్ డాక్టర్ హరిబాబు
కంభంపాటి
● ముగిసిన మత్స్య, పశు వనరుల అభివృద్ధి ఉత్సవం
భువనేశ్వర్: మత్స్య, పశుసంవర్ధక రంగాలను ఆధునిక, సాంకేతికత ఆధారిత మరియు లాభదాయక ఆవిష్కరణల వేదికలుగా మలచుకోవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సూచించారు. స్థానిక జనతా మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి మత్స్య, పశు వనరుల అభివృద్ధి ఉత్సవం, మత్స్య ప్రాణి సమావేశం ఒడిశా–2026 ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. మత్స్య, పశు సంవర్ధకం రంగాలు సాంప్రదాయ పరిధులను అధిగమించి, విస్తారమైన అవకాశాలను అందించే అత్యద్భుత రంగాలుగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. యువత ఆయా రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కామధేను యోజన, ముఖ్యమంత్రి మత్స్య జీవి కల్యాణ్ యోజన, ప్రాణి సంపద సమృద్ధి యోజన వంటి పథకాలు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన, రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి జాతీయ కార్యక్రమాలు ఆదాయాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు. సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం మత్స్య, పశు సంవర్ధకంలో గొప్ప సామర్థ్యాన్ని కొనియాడారు. అనంతరం అత్యుత్తమ రైతులను ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో న్యాయ, నిర్మాణం, అబ్కారీ శాఖల మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, మత్స్య, పశు వనరుల అభివద్ధి మరియు ఎంఎస్‌ఎంఈ విభాగం మంత్రి గోకులానంద మల్లిక్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, మత్స్య మరియు పశు సంపద అభివృద్ధి శాఖకు చెందిన సురేష్ కుమార్ వశిష్ఠ్ తదితరులు పాల్గొన్నారు.


