అంధుల టీ–20 విజేతగా ఒడిశా టీమ్
భువనేశ్వర్: స్థానిక హైటెక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ గ్రౌండ్‌లో జరిగిన జాతీయ మహిళా అంధుల క్రికెట్ టీ–20 టోర్నమెంట్‌ను ఒడిశా టీమ్ కై వసం చేసుకుంది. మధ్యప్రదేశ్ టీమ్‌తో జరిగిన ఫైనల్‌లో 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజేతలకు హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పాణిగ్రాహి, హైటెక్ గ్రూప్ ట్రస్టీ డాక్టర్ రాకేష్ కుమార్ పాణిగ్రాహి, ట్రస్టీ విశ్వజిత్ పాణిగ్రాహి, జిందాల్ ఫౌండేషన్ సీఎస్‌ఆర్ హెడ్ రిషి పఠానియా, ఇండియన్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బూమే గౌడ్, సాలేంద్ర యాదవ్, మహిళా మరియు శిశు అభివృద్ధి చైర్మన్ మేజర్ డాక్టర్ సమల్ దాస్, దివ్యాంగుల విభాగం సామాజిక భద్రత మరియు సాధికారత, డిప్యూటీ కార్యదర్శి వసంత్ బెహరా, ఒడిశా బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ జాఫర్ ఇక్బాల్ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హైటెక్ గ్రూప్ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి మాట్లాడుతూ.. విజేత మహిళల అంధుల జట్టును అభినందించారు. మహిళా క్రికెటర్లకు హైటెక్ అత్యాధునిక సాంకేతిక సహాయాన్ని అందిస్తుందన్నారు. భవిష్యత్‌లో ఈ సాయం నిరవధికంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.


