ఢిల్లీకి కాంగ్రెస్ నాయకులు
రాయగడ: ఈనెల 14వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఓట్ చోరీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు గురువారం ఢిల్లీకి పయనమయ్యారు. రాయగడ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక నేతృత్వంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు కార్తిక్ నాయక్, బప్పీ పట్నాయక్, అస్లామ్ ఖాన్, హరీష్ పట్నాయక్ తదితరులు ఢిల్లీ వెళ్లినవారిలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు తామంతా ఆందోళనలొ పాల్గొనేందుకు పయనమైనట్లు ఎమ్మెల్యే కడ్రక తెలియజేశారు.
పర్లాకిమిడి బైపాస్ రోడ్డుకు సర్వే
పర్లాకిమిడి: ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పర్లాకిమిడి బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 4 కిలోమీటర్ల దూరంతో రూ.39 కోట్లతో నిర్మించనున్న బైపాస్ రోడ్డు పర్లాకిమిడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజిపూర్ రోడ్డు నుంచి హత్తిబడి మీదుగా గుమ్మా గెడ్డ వరకు చేపట్టనున్నారు. దీనికోసం డెంకనాల్ నుంచి అరుణ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎఫైర్స్ ఇంజినీరు మనోరంజన్ మిశ్రా జాజిపురం గ్రామానికి విచ్చేసి సర్వే కోసం రైతులతో మాట్లాడారు. బైపాస్ రోడ్డు నిర్మిస్తే పర్లాకిమిడిలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అయితే బైపాస్ రోడ్డు నిర్మాణానికి 33 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉందని మిశ్రా పేర్కొన్నారు. రెండు రోజులు పాటు ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణానికి సర్వే పూర్తి చేసి కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
లారీ – పికప్ వ్యాన్ ఢీ
రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరానికి వెళ్లే రహదారి వద్ద గురువారం తెల్లవారుజామున లారీ, పికప్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పికప్ వ్యాన్ ముందరి భాగం నుజ్జునుజ్జయ్యింది. అదేవిధంగా లారీ ముందరి భాగం కొంత దెబ్బతిన్నది. పికప్ వ్యాన్ డ్రైవరు స్పల్పగాయాలతో బయటపడ్డాడు. మంచు వలన రోడ్డు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని అక్కడివారు చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అదేవిధంగా పికప్ వ్యాన్, లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
శ్రీ జగన్నాథునికి మహా స్నానం
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న వేదికపై శ్రీ జగన్నాథ స్వామికి మహా స్నానం నిర్వహించారు. గురువారం మధ్యాహ్న ధూపం తర్వాత లోపలి వాకిలి దగ్గర వాంతి తారసపడింది. దీంతో ఆలయ ఆచారం ప్రకారం శుద్ధి వగైరా తంతు ముగించి సర్వ దర్శనాన్ని పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో సుమారు 4 గంటలపాటు శ్రీ జగన్నాథుని సర్వ దర్శనానికి అంతరాయం ఏర్పడింది.
వ్యర్థాల వినియోగంపై అవగాహన
రాయగడ: వ్యర్థాలను వినియోగించి వాటి ద్వారా అవసరమైన సేంద్రియ ఎరువులను రూపొందించే ప్రక్రియకు సంబంధించి విద్యార్థులకు మున్సిపాలిటీ యంత్రాంగం అవగాహన కల్పించింది. స్థానిక సెంట్‌జేవియర్స్‌కు చెందిన సుమారు 500 మంది విద్యార్థులకు మున్సిపాలిటీ యంత్రాంగం వంటిగుడలో నిర్వహిస్తున్న వెల్త్ సెంటర్, ఎఫ్‌ఎస్‌టీపీ కేంద్రాలను చూపించారు. వ్యర్థాల వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వివరించే ప్రయత్నం చేశామని మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ తెలియజేశారు.
ఢిల్లీకి కాంగ్రెస్ నాయకులు


