కన్ను పడిందా.. స్థలం గోవిందా!
నరసన్నపేట : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందాం అన్న చందంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్నారు. దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. అనుమతులు లేకుండా పలుచోట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే పలు స్థలాలను కబ్జా చేసిన అధికార పార్టీ కార్యకర్తలు తాజాగా జాతీయ రహదారికి ఆనుకొని తామరాపల్లి వద్ద పాత సర్వే నంబర్ 3/15ఎ (ఎల్‌పీ 11)లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తామరాపల్లి, జమ్ములకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఈ స్థలంలో నిర్మాణ పనులు చేపడుతున్నారు. విలువైన ఈ స్థలాన్ని ఇప్పటి వరకూ ప్రభుత్వ యంత్రాంగం కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీరి కన్ను పడటంతో స్థలం కబ్జాకు గురవుతోందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో ఈ స్థలం లక్షలు విలువ చేస్తుందని చెబుతున్నారు. ఈమేరకు తామరాపల్లికి చెందిన ముచ్చ గణేష్ సంబంధిత అదికారులకు ఈ స్థలం ఆక్రమణల గురించి తెలియజేశారు. వెంటనే తహసీల్దార్ స్పందించి వీఆర్వో లుకలాపు శ్రీనును పంపించి పరిస్థితిని తెలుసుకున్నారు. పనులు తాత్కాలికంగా నిలుపుద ల చేశారు. ఈ స్థలంలో ఎటువంటి పనులు చేయవద్దని వీఆర్వో ఆక్రమణదారులకు సూచించారు. ఎటువంటి ఆక్రమణలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ స్థలాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారని, స్థలాన్ని పరిరక్షించి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని గణేష్ విజ్ఞప్తి చేశారు.
బొడ్డవలస రెవెన్యూ పరిధిలో..
మరోవైపు, నరసన్నపేట పంచాయతీ బొడ్డవలస రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 46/1ఎలో ఉన్న జిరాయితీ భూమికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలా న్ని ఆక్రమించుకోవడానికి పట్టణానికి చెందిన కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మట్టి దిబ్బలను చదును చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వీఆర్వో శ్యామ్ ఈ స్థలాన్ని పరిశీలించారు. అయితే జిరాయి తీ పేరిట శ్మశానం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాజేసే అవకాశం ఉందని, సర్వే చేసి శ్మశాన స్థలం నిర్ధారించాల స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే రాతికర్ర చెరువులో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ విషయమై కలెక్టర్‌కు నరసన్న పేట ఎంపీపీ ఆరంగి మురళీ తదితరులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇందిరానగర్‌లోని బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిబందనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతోంది. సుడా అధికారులు మొదట్లో అనుమతులు ఇచ్చి తర్వాత స్టాప్ ఆర్డర్‌ఇచ్చారు. తదుపరి అనుమతులు పొందే వరకూ పనులు చేపట్టవద్దని ఆదేశించినా పనులు యథేఛగా జరుగుతున్నాయి. ఇలా అధికార పార్టీ వర్గీయులు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కన్ను పడిందా.. స్థలం గోవిందా!


