ఏకలవ్య ఆదర్శ పాఠశాల విద్యార్థి మృతి
జయపురం:
జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి దమణహండిలో గల ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి బుధవారం మృతి చెందాడు. విద్యార్థి మృతికి విద్యాలయ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి శ్రీరామ భూమియ(12) అని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అతడిది ఘుమర గ్రామ పంచాయతీ గుడియగుడ గ్రామం. నవంబర్ 24వ తేదీన జ్వరం వచ్చింది. స్కూలు అధికారులు 25న తల్లికి పద్మ భూమియకు కబురు చేశారు. విద్యార్థిని ఇంటికి పంపించి ఊరుకున్నారు. విద్యార్థి తల్లి జయపురం జిల్లా కేంద్ర హాస్పిట్‌కు, అనంతరం కొరాపుట్ జిల్లా సాహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్‌కు మెరుగైన చికిత్స కోసం తరలించింది. స్కూలు అధికారులు విద్యార్థి ఆరోగ్య స్థితిని పట్టించుకోలేదు. శ్రీరామ్ భూమియ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి మరణానికి ప్రధాన కారణం ఏకలవ్య విద్యాలయ విద్యాధికారులే కారణమని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. పాత్రికేయులు కొందరు ప్రజల ఆరోపణను ఏకలవ్య ఆదర్శ విద్యాలయ ప్రిన్స్‌పాల్ నిరంజన్ నిరోల్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఆరోపణలను ఆయన ఖండించారు. శ్రీరామ భూమియకు జ్వరం రాగా పాఠశాల నర్స్ చికిత్స చేసిన తరువాత అతడి ఇంటికి కబురు చేసి పంపామని వెల్లడించారు. విద్యార్థి మరణించినట్లు సమాచారం అందిన ఆదివాసీ భొత్ర వికాశమంచ్ నేతలు, సమాజ సేవకుడు రంజన్ కుమార్ పట్నాయిక్, కె.రాజ శేఖరరావు, తదితరులు తల్లిని కలిసి సంతాపాన్ని తెలిపారు. తమవంతు సహాయం అందిస్తామని తెలిపారు. తన కుమారునికి జ్వరం అని తనకు తెలిపారని, కానీ మెరుగైన చికిత్స చేయించలేదని తల్లి పద్మ భూమియ ఆరోపించింది. బుధవారం విద్యాలయ అధికారులు తనకు కబురు చేసి రూ.5 వేలు పంపారని తెలిపింది.
ఏకలవ్య ఆదర్శ పాఠశాల విద్యార్థి మృతి


