రోడ్డు ప్రమాదంలో పాత్రికేయుడు మృతి
జయపురం: ఒడియా దినపత్రిక ‘సంబాద్’ జయపురం పాత్రికేయులు అశోక్ పొలాయ్(49) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బుధవారం ఆయన నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సమీప అత్తగారి గ్రామం ధొహణ లో బందువు దహణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. నవరంగపూర్ జిల్లా డాబుగాం సమీప జయగురు సమీపంలో బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయమైంది. స్థానిక ప్రజలు అతడిని డాబుగాం కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తలరించారు. అతడిని పరీక్షించిన డాక్టర్ అశోక్ పొలాయి మరణించినట్లు ప్రకటించారు. అతని మృతదేహాన్ని గురువారం జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ పోస్టుమార్టం జరిపి బంధువులకు అప్పగించారు. అశోక్ మరణ వార్త విన్న జయపురం పాత్రికేయులు అతడి ఇంటికి వెళ్లి కన్నీటి నివాళులు అర్పించారు. అశోక్ పాత్రికేయుడే కాదు మంచి రచయిత,సాహిత్యకుడు, సమాజ సేవకుడు కూడా.


