వేడుకగా బొయితొ బొంధొనొ
భువనేశ్వర్: బొయితొ బొంధొనొ పండుగ నేటి ప్రపంచానికి ఒక లోతైన సందేశాన్ని అందిస్తుందని, మానవ, ప్రకృతి లయ మధ్య సామరస్యాన్ని అందరికీ గుర్తు చేస్తుందని గవర్నర్ హరిబాబు కంభంపాటి అన్నారు. పర్యావరణ క్షీణత, కనుమరుగవుతున్న సాంస్కృతిక, ఆర్థిక అసమానత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో బొయితొ బొంధొన్ మానవాళికి శ్రేయస్సు, సుస్థిరత కలిసి ఉండగలవని బోధిస్తుందని రాష్ట్ర గవర్నర్ ప్రసంగించారు.
ఖుర్ధా జిల్లా బలుగాంవ్‌లో జరిగిన చిలికా బొయితొ బొంధొన్ మహోత్సవం–2025 ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఒడిశా సముద్ర వర్తక వారసత్వం, ప్రాచీన నావికుల ధైర్యసాహసాల వేడుక అని అన్నారు. ప్రాచీన కళింగ ప్రజల సముద్ర మార్గంలో వర్తక సంప్రదాయాన్ని చిరస్మరణీయం చేయడంలో ఈ వేడుక దోహదపడుతుందన్నారు. బొయితొ బొంధొనొ అత్యంత విలువైన సంప్రదాయంగా అభివర్ణించిన గవర్నర్ పూర్వీకులు వాణిజ్య వస్తువులను మాత్రమే కాకుండా, నాగరికత యొక్క సారాంశాన్ని, కళ, భాష, విశ్వసనీయతని వర్తక రంగంలో పొరుగు దేశాలకు తెలియజేయడం దీనిలో ఇమిడి ఉన్న విశిష్టతగా పేర్కొన్నారు. కళింగ రాజ్యంలో ప్రాచీన కాలం నుంచి నావికా వర్తక వ్యాపారాలతో పొరుగు దేశాలతో వ్యాపార సంబంధాలు, సాంస్కృతిక అనుబంధాలు కలిగి ఉన్నట్లు ఈ బొయితొ బొంధొనొ గుర్తు చేస్తుందన్నారు. ఆగ్నేయ ఆసియా అంతటా ఈ విలువల్ని వ్యాప్తి చేశారన్నారు. ఇండోనేషియాలోని బోరోబుదూర్, కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ వంటి ప్రాంతాల్లో ఒడిశా నావికా వ్యాపార శైలికి సంబంధించిన పలు ఆనవాళ్లు నేటికీ తారసపడడం అద్భుతంగా పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకు పైగా బొయితొ బొంధొనొ ఉత్సవం నిరవధికంగా నిర్వహించడం అభినందనీయమని ఖుర్ధా జిల్లా యంత్రాంగం, నిర్వాహకులు, కళాకారులు మరియు స్వచ్ఛంద సేవకులను డాక్టర్ కంభంపాటి ప్రశంసించారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ సురమా పాఢి, న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ప్రముఖ సాహిత్యకారుడు డాక్టర్ బిజయానంద సింగ్, ఖుర్ధా జిల్లా కలెక్టర్ అమృత్ రుతురాజ్, కార్య నిర్వాహక అధ్యక్షుడు దుష్మంత హరిచందన్ ఈ సందర్భంగా ప్రసంగించారు.


