ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు
కంభంపాటి
భువనేశ్వర్: దీర్ఘకాలిక పారిశ్రామిక దృక్పథంతో శాఖాపరమైన చొరవలను సమన్వయపరచాల్సి ఉంది. రాష్ట్రం అంతటా వ్యవస్థాపకత, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు సమగ్ర వ్యూహాత్మక కార్యాచరణ రూపకల్పన జరగాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన రాజ్ భవన్ నూతన అభిషేక్ హాల్‌లో పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ శాఖ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం జరిగింది. రానున్న ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 147 శాసన సభ నియోజక వర్గాల్లో ఒక్కో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను ఏర్పాటు చేయాలని గవర్నర్ అధికారులను కోరారు. ఈ చొరవ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపకత, ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించి పరివర్తనాత్మకంగా ఫలితాల్ని ప్రదర్శిస్తుందన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రతి శాసన సభ నియోజక వర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడం ప్రారంభించాయని అన్నారు. నేడు రక్షణ, అంతరిక్ష రంగాల్లో అవకాశాలు పుష్కలం. భారత ప్రభుత్వం అనేక ఉత్పత్తి వర్గాలలో దేశీయ సేకరణకు ప్రాధాన్యత కల్పిస్తుంది. భూమి, పెట్టుబడి, పరికరాలు, సాంకేతిక అవసరాలతో వివరణాత్మక పథకాలతో ప్రాజెక్ట్ వివరాలు సాంకేతిక సంస్థలు, నైపుణ్య కేంద్రాల విద్యార్థి యువతలో వినూత్న ఆలోచనలను ప్రేరేపిస్తాయి, కొత్త ఎంఎస్‌ఎంఈలను స్థాపించడంలో సహాయపడతాయని గవర్నర్ అన్నారు. ఉత్కర్ష్ ఒడిశా సందర్భంగా అందిన ప్రతిపాదనలపై సాధించిన పురోగతి, వాటి అనుబంధ అవగాహన ఒప్పందాలు వాస్తవ స్థితిగతుల్ని గవర్నర్ సమీక్షించారు. వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడంలో వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఐవైబీ – ఈడీపీ) గురించి చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంపై అవగాహన కీలకం, వాటి వలన ఎంత మంది శిక్షణార్థులు వ్యవస్థాపకులుగా మారారో తెలుసుకోవడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని గవర్నర్ ప్రతిపాదించారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) గురించి డాక్టర్ కంభంపాటి మాట్లాడుతూ సబ్సిడీ పథకాలను అందించే విభాగాలు కూడా చేయూతనిచ్చి లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా బ్యాంకులతో సన్నిహితంగా సమన్వయం చేసుకోవాలని సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన అమలును కూడా ఆయన సమీక్షించారు. రాష్ట్రం నుంచి ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్‌లు, ఎగుమతులకు సంబంధించిన అంశాలను సమావేశంలో లోతుగా చర్చించారు. సమ్మిళిత, స్థిరమైన పారిశ్రామిక వృద్ధి కోసం ఈ చొరవలను బలోపేతం చేయాలని గవర్నర్ ప్రోత్సహించారు. సమీక్ష సమావేశానికి హాజరైన వారిలో పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, సమాచారం, ప్రజా సంబంధాల విభాగం, మహిళా మరియు శిశు అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈ ప్రిన్సిపల్ కార్యదర్శి శుభ శర్మ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజీవ్ కుమార్ మిశ్రా, గవర్నర్ కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు, ఇపికాల్ మేనేజింగ్ డైరెక్టర్ భూపేంద్ర సింగ్ పుణియా, స్టార్టప్ ఒడిశా సీఈఓ రష్మితా పండా, పరిశ్రమల డైరెక్టర్ అబోలి ఎస్. నర్వానే, పరిశ్రమలు మరియు ఎంఎస్‌ఎంఈ విభాగాల సీనియర్ అధికారులు ఉన్నారు.


