
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
జయపురం: జయపురం మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు శనివారం ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో గల 10 ట్రాక్టర్లలో పని చేస్తున్న 30 మంది, 20 టాటా ఏస్ వాహనాలలో పని చేస్తున్న 40 మంది పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. జీతాలు ఇచ్చేంత వరకు వాహనాలు నడిపేదే లేదన్నారు. కంట్రాక్టర్ వచ్చి నెల జీతం చెల్లించటంతో ఆందోళన విరమించి పనుల్లోకి చేరారు. మున్సిపాలిటీ నిబంధన ప్రకారం పారిశుద్ధ్య కార్మికులను కంట్రాక్టర్ ప్రతి నెలా జీతాలు చెల్లించకపోతే.. మున్సిపాలిటీ చెల్లించాలన్నారు. రెండు రోజుల్లో దీపావళి ఉన్నా కంట్రాక్ట్ కంపెనీ జీతాలు ఇవ్వకపోవటంతో ఆందోళనకు దిగినట్లు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐలు ప్రతి నెలా సకాలంలో జమ చేయటం లేదని ఆరోపించారు. ఒప్పందం ప్రకారం వీటిని ప్రతి నెలా కంట్రాక్టర్ జమ చేయాలని, లేకపోతే జరిమానా పడుతుందన్నారు. మున్సిపాలిటీ కంట్రాక్ట్ సంస్థకు పట్టణ పారిశుద్ధ్యం నిమిత్తం నెలకు రూ.76 లక్షలకు పైగా బిల్లు చెల్లిస్తుందన్నారు. మున్సిపాలిటీలో గల 28 వార్డులను 4 జోన్‌లుగా విభజించి 371 మంది పారిశుద్ధ్య స్వీపర్లను నియమించింది. వీరిలో ఆందోళన చేపట్టిన 70 మంది వాహనాల్లో పని చేస్తున్నారు.