
అనుమతులెలా ఇచ్చారు..?
టెక్కలి: జనావాసాలు, విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలకు ఎలా అనుమతులిచ్చారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ టెక్కలి అగ్నిమాపక అధికారి సూర్యారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో ప్రత్యేక పారిశుద్ధ్య పనుల పరిశీలన కోసం విచ్చేసిన ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయ దుకాణాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిశీలన, స్థానిక అభ్యంతరాలు చూడకుండా కేవలం పత్రాలు చూసి అనుమతులు ఇచ్చారా అని నిలదీశారు. తక్షణమే అభ్యంతరకంగా ఉన్న దుకాణాన్ని మార్పు చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్ బి.సత్యం, డీఎల్‌పీవో ఐ.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.